
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
నిజామాబాద్‌నాగారం: ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డీపీహెచ్) డాక్టర్ రవీందర్ నాయక్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు సంతృప్తికరంగా వైద్య సేవలు అందించాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వైద్య కళాశాలను కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి డీపీహెచ్ రవీందర్ నాయక్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఐసీయూ, ఆర్‌ఐసీయూ, ల్యాబ్, బ్లడ్ బ్యాంకు, టీ హబ్ తదితర వాటిని పరిశీలించారు. వైద్య కళాశాలలో ఫిజియాలజీ, అనాటమీ, హెమటాలజీ ల్యాబ్‌లు, లైబ్రరీ, లెక్చరర్ హాల్ ఇతర విభాగాలను సందర్శించారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్‌లో ఆయా విభాగాల అధిపతులతో సమావేశమై అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా డీపీహెచ్ రవీందర్ నాయక్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ఎన్‌ఎంసీ అనుమతుల మంజూరులో ఇబ్బందులకు ఆస్కారం ఉండదన్నారు. వైద్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఉండాలన్నారు. ఖాళీలు ఉంటే, వాటి వివరాలను సమర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అవసరమయ్యే వైద్య పరికరాలు, యంత్రాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్‌లకు సూచించారు. తాము క్రమం తప్పకుండా ఆస్పత్రిని తనిఖీ చేస్తానని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. వీరి వెంట డీఎంహెచ్‌వో డాక్టర్ రాజ శ్రీ, వైద్య విభాగాల అధిపతులు ఉన్నారు.
మెడికల్ కాలేజీలో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు సదుపాయాలు కల్పించాలి
వైద్యాధికారులకు సూచించిన
డీపీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్,
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
జీజీహెచ్, మెడికల్ కళాశాల తనిఖీ

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి