
నేరాలు, ప్రమాదాల నివారణకు ‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’
ఖలీల్‌వాడి: రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణ కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందికి ప్రణాళిక ప్రకారంగా ‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’ నిర్వహించాలని సీపీ పోతరాజు సాయిచైతన్య ఎస్సైలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో బుధవారం బోధన్ డివిజన్‌లోని పోలీసు అధికారులకు నేరాల నియంత్రణపై నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. లాంగ్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వచ్చే ఆరు నెలల్లో ప్రతి ఎస్‌హెచ్‌వో లక్ష్యాలు పెట్టుకొని నేరాల నియంత్రణ కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్లను గుర్తించి, అక్కడ ప్రమాదాలు జరగకుండా కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన ‘నిఘా’ ఏర్పాటు, లాడ్జీలలో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి , ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం పాల్గొన్నారు.
ప్రతి ఎస్‌హెచ్‌వో ప్రణాళిక
ఏర్పాటు చేసుకోవాలి
సీపీ సాయి చైతన్య