
మట్టి వ్యాపారులకు చెక్
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతం (బాల్కొండ మండలం జలాల్‌పూర్ శివారు) లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న మట్టి తవ్వకాలను అధికారులు అడ్డుకున్నారు. ఈ మట్టి దందాపై సోమవారం సాక్షి దిన పత్రికలో ‘అనుమతులు లేవు.. పర్యవేక్షణ లేదు’ అనే శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ప్రాజెక్ట్ ఏఈఈ రవి ఆధ్వర్యంలో అధికారులు రెండు పొక్లెయిన్లను పట్టుకుని బాల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యూజీసీ నెట్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ డివిజన్‌లోని యూజీసీ నెట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య మంగళవారం తెలిపారు. ఈనెల 25 నుంచి 29 వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మల్టీ షిఫ్ట్ ప్రకారం పరీక్షలు జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని అర్సపల్లి బైపాస్ రోడ్డులో గల పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా నిషేధిత ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ బీఎన్‌ఎస్‌ఎస్ 163 అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్‌లను ఈనెల 25 నుంచి 29 వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలన్నారు.

మట్టి వ్యాపారులకు చెక్