నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ జిల్లాలో గురువారమే ప్రారంభమైంది. కలెక్టర్ అభిలాషఅభినవ్ విజయవంతంగా ప్రారంభించారు. గ్రామస్థాయి నుంచి దాదాపు పది ప్రధాన అంశాల్లో ప్రణాళికబద్ధంగా ప్రగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 99రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈనెల 3న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈకార్యక్రమంపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు సంబంధించి శుక్రవారం ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాలో ఈమేరకు కార్యక్రమాలను చేపట్టేందుకు కలెక్టర్ అభిలాషఅభినవ్ ఆధ్వర్యంలో అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నిర్మల్ మున్సిపాలిటీలో తనిఖీలు చేశారు. ప్రజలతో మాట్లాడారు.
99 రోజుల పాటు..
రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని 99 రోజులు పకడ్బందీగా అమలు చేయనుంది. పల్లెస్థాయి నుంచి రూపురేఖలు మార్చే దిశగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య మెరుగుదల తదితర లక్ష్యాలను పెట్టుకున్నారు. గ్రామాల్లో ఈనెల 6 నుంచి మే 31 వరకు ఏ రోజు ఏ పని పూర్తిచేయాలో స్పష్టమైన గడువు విధిస్తూ పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజలకు సేవలు అందేలా..
ప్రజాసమస్యలు పరిష్కరించడం, ప్రభుత్వ సేవల ను ప్రజలకు సమర్థవంతంగా అందించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ నుంచి జిల్లాస్థాయి వర కు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడం, ప్రజారోగ్యం, రోడ్డు భవన నిర్మాణాలు, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళల అభ్యున్నతి, పర్యావరణం, మాదకద్రవ్యాల నిర్మూలన తదితరలు అంశాలు ఇందులో ఉన్నాయి. సంబంధిత శాఖలు ఎప్పుడెప్పుడు ఏయే కార్యక్రమాలను చేపట్టాలనే దానిపై ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోనూ సంబంధిత అధికారులు ఈమేరకు కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు.
విజయవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని జిల్లాలోనూ 99 రోజులు విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చాం. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జిల్లావాసులూ సహకరించాలి. – అభిలాషఅభినవ్, కలెక్టర్
ఐదు దశల్లో..
ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2న ప్రతీ గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న మండలస్థాయి సమావేశాలు ఉంటాయి. మే 2న నియోజకవర్గస్థాయి కార్యక్రమాలు చేపడతారు. మే 22న జిల్లాస్థాయి సమావేశాలు, కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉండనున్నాయి. జూన్ 12న ఈ కార్యక్రమం ముగియనుంది. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని అమలు చేయటంతోపాటు పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను కూడా సిద్ధం చేసింది.
నిర్మల్ పట్టణంలో సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్


