చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రకటించిన సీఎం రెండు నెలలైనా రూపాయి విడుదల చేయని వైనం.. హామీ అమలుకు నోచుకోలేదంటున్న సర్పంచులు
ముధోల్: పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన సుమారు రెండేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించింది. పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి కూడా పంచాయతీలకు స్పెషల్ ఫండ్ ప్రకటించారు. అయితే రెండు నెలలైనా నిధులు విడుదల చేయలేదు.
సీఎం వరాలు
కొత్త సంవత్సర కానుకగా సీఎం రేవంత్‌రెడ్డి చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున సీఎం కోటా నుంచి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. జిల్లాలో 400 పంచాయతీలకు మొత్తం రూ.32 కోట్ల వరకు వస్తాయని లెక్కలు వేశారు కొత్త సర్పంచులు. కానీ రెండు నెలలైనా ఒక్క పంచాయతీకి కూడా నిధులు రాలేదు.
ఆర్థిక ఇబ్బందుల్లో పంచాయతీలు..
ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం విడుదల చేసిన నిధులు అరకొరగా ఉన్నాయి. పంచాయతీ నిర్వహణకు, చెల్లించాల్సిన బిల్లులకు పేరుకుపోయాయి. రాష్ట్రం నుంచి రావాల్సిన గ్రామపంచాయతీల అభివృద్ధి నిధులు ఆలస్యం కారణంగా సర్పంచులు బిల్లులు చెల్లిస్తున్నారు. నిధులు లేకపోవడంతో చిన్న చిన్న పనులు కూడా చేయించలేని పరిస్థితి ఉందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి హామీ అమలు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి..
పంచాయతీల పాలన ఇంకా గాడిన పడలేదు. నిధులు లేక బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ప్రభత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తున్నాం. ఆర్థిక సంఘం నిధులతో ముడి పెట్టకుండా సీఎం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మాటకు కట్టుబడి ఉండాలి. – కృష్ణయ్య, బోరిగాం సర్పంచ్
జీపీలను చులకనగా చూడొద్దు
పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడొద్దు. ఎవరూ అడగకుండానే సీఎం రేవంత్‌రెడ్డి తన కోటా నిధులు చేస్తానని హామీ ఇచ్చారు. రెండు నెలలైనా ఆ నిధులు విడుదల చేయలేదు. నిధులు విడుదలైతే పంచాయతీలకు ఊరట లభిస్తుంది. – మల్లేశ్, రువ్వి సర్పంచ్


