శ్రీ రామనవమి శోభా యాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మెల్యేకి గాయాలు

West Bengal BJP MLA Injured At Ram Navami shobha yatra Clashes - Sakshi

కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు చల్లారడం లేదు. శ్రీరామ నవమి వేడుకల కోసం తాజాగా నిర్వహించిన శోభా యాత్రలోనూ హింస చెలరేగింది.   ఆదివారం హూగ్లీలో బీజేపీ నిర్వహించిన శోభా యాత్రలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బీజేపీ ఎమ్మెల్యే బీమన్‌ ఘోష్‌ గాయపడగా, ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు.  ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన పోలీసులు.. 24 గంటలపాటు జనాలు గుమిగూడడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. 

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ప్రారంభించిన ఈ యాత్రలో..  ఒకవైపు నుంచి ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో అంతా తలోపక్క పారిపోవడం సీసీటీవీలో రికార్డు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామ నవమి ఊరేగింపులో భాగంగా భారీగా డీజే సౌండ్‌తో కొందరు కత్తులు దూస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఓ మసీదు వద్దకు రాగానే.. చాలాసేపు అక్కడే డీజే నడిపించారు. అయితే అప్పటికే చాలా ఆలస్యంగా శోభా యాత్రను ప్రారంభించి.. సమయం ముగిశాక కూడా కొనసాగించారు. 

ఆ సమయంలో మసీదును లక్ష్యంగా చేసుకుని యాత్ర ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కొందరు గట్టిగట్టిగా అరవడంతో.. ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ క్రమంలో చెరోవైపు నిల్చుని ఇరు వర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి. ఈలోపు సమాచారం అందుకున్న పోలీసులు  వెంటనే భద్రతా బలగాలతో స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసే యత్నం చేశాయి. అంతలోనే రాళ్ల దాడి జరిగింది.  ఈ  దాడిలో ఎమ్మెల్యే బీమన్‌ గాయపడడంతో.. అనుచరులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. 

ఈ పరిస్థితికి అధికార టీఎంసీ పనేనని బీజేపీ బెంగాల్‌ చీఫ్‌ సుకాంత మజూందార్‌ ఆరోపిస్తున్నారు. హూగ్లీ బీజేపీ శోభా యాత్రపై దాడి జరిగింది. కారణం స్పష్టంగా తెలుస్తోంది. మమతా బెనర్జీకి హిందువులంటే ద్వేషం అంటూ మజూందార్‌ ట్వీట్‌ చేశారు. బెంగాల్‌లో పరిస్థితిపై జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాసింది బెంగాల్‌ బీజేపీ. ఇక ఈ రాళ్లదాడిలో పలువురు పోలీస్‌ సిబ్బంది సైతం గాయపడ్డారు. మరోవైపు అక్కడి పరిస్థితిపై గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. కారకులు ఎవరైనా 24 గంటల్లో అరెస్ట్‌ అవుతారంటూ మీడియాకు తెలిపారాయన. 

ఇదిలా ఉండగా.. హూగ్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని హౌరాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. దీంతో ఆంక్షలు ఎత్తేసి.. అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు పోలీసులు. 

గురువారం హౌరాలో కాజిపారా ప్రాంతంలో నవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. హింసకు బీజేపీ, హిందూ సంఘాలే కారణమని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించగా.. ఎన్‌ఐఏ ద్వారా దర్యాప్తు చేయిస్తే అసలు కారకులు ఎవరో బయటపడుతుందని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. 

మరోవైపు బీహార్‌లోనూ శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా చెలరేగిన హింసలో ఒకరు చనిపోగా, వంద మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నలందలో 144 సెక్షన్‌ విధించడంతో పాటు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు స్కూల్స్‌కు బంద్‌ ప్రకటించారు.

ఇదీ చదవండి: అల్లర్లకు పాల్పడ్డవారిని తలకిందులుగా ఉరి తీస్తాం-అమిత్‌ షా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top