ఎన్‌ఈపీ 2020: తమిళనాడు కీలక నిర్ణయం

Tamil Nadu Says Wont Allow 3 Language Formula Over NEP 2020 - Sakshi

మూడు భాషల విధానాన్ని అమలు చేయబోము: తమిళనాడు సర్కారు

చెన్నై: కేంద్రం ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానం(ఎన్‌ఈపీ)–2020లోని మూడు భాషల విధానం తమను వేదనకు గురిచేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విచారం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు.  మూడు భాషల విధానాన్ని పునఃసమీక్షించాలని, దీని అమలుపై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. 1965లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హిందీని అధికార భాషగా గుర్తించినపుడు తమిళనాడు విద్యార్థులు చేసిన ఉద్యమాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర నిర్ణయంతో తాము ఏకీభవించలేమని, ద్విభాషా(తమిళ్‌, ఇంగ్లీష్‌)ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సైతం ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు.(పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు)

అదే విధంగా మాజీ ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్‌, జయలలిత, సీఎన్‌ అన్నాదురై రాష్ట్రాలపై హిందీయేతర భాషా రాష్ట్రాలపై ఆ భాషను బలవంతంగా రుద్దవద్దని తీసుకున్న నిర్ణయాల గురించి పునరుద్ఘాటించారు. కాగా తాము ఏ రాష్ట్రంపై, ఏ భాషను రుద్దే ప్రయత్నం చేయడం లేదని కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ట్వీట్‌ చేసిన మరుసటి రోజే పళనిస్వామి తన ప్రభుత్వం తమ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.ఇక విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఎన్‌ఈపీ–2020కు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. (జాతీయ విద్యావిధానంపై కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు)

ఇందులో భాగంగా ప్రి స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అంతేగాక  కనీసం 5వ తరగతి వరకు మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా ఉంచాలని.. 8వ తరగతి నుంచి ఆపై వరకూ దీనిని కొనసాగించవచ్చని సూచించింది. మూడు భాషల(హిందీ, ఇంగ్లిష్‌, ప్రాచుర్యం పొందిన ఇతర భాష(దక్షిణాది భాష) విధానంలో భాగంగా పాఠశాలలోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు సంస్కృతాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. 

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై తమిళనాడు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రజలపై హిందీ, సంస్కృత భాషలు రుద్దేందుకు కేంద్ర సర్కారు చేస్తున్న ప్రయత్నమిదని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇతర పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సైతం జట్టుకట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ ప్రకటన విడుదల చేశారు. తాజా సంస్కరణలు మనుస్మృతికి మెరుగులు దిద్ధినట్లు ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాము ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.

ఇక తమిళనాడులో మాతృభాషపై మక్కువ, హిందీ భాషపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో హిందీ భాషను అధికార భాషగా గుర్తించే ప్రయత్నాలు చేయగా.. ఈ దక్షిణాది రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో అప్పటి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ కేంద్ర, హిందీయేతర రాష్ట్రాల మధ్య అనుసంధానానికై ఇంగ్లీష్‌ భాష వారధిగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top