
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనపై విమర్శలు చేస్తున్నవారికి అత్యంత విచిత్రంగా సమాధానం చెప్పారు. బీహార్‌లోని ఆరాలో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొన్న రాహుల్ గాంధీ తనకు ఎదురైన నిరసనకారులకు ప్రేమతో సమాధానం చెప్పారు. ఇటీవల బీహార్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ వేదికపైనున్న కొందరు నేతలు.. ప్రధాని మోదీ, ఆయన తల్లిపై దుర్భాషలాడారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇందుకు బాధ్యత వహిస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు రాహుల్ గాంధీ యాత్రకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టారు. తాజాగా ఆరా జిల్లాలో జరుగుతున్న ఈ నిరసనలకు రాహుల్ గాంధీ అనూహ్యంగా స్పందించారు. నిరసనకారులకు చాక్లెట్లు ఇచ్చి, సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలాగే రాహుల్ యాత్ర మరింతమంది దృష్టిని ఆకర్షించింది.
#WATCH | Arrah, Bihar: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi offered candies to BJYM workers who showed him black flags and confronted him over the alleged derogatory remarks made against the Prime Minister and his late mother at a Mahagathbandhan event in Darbhanga. pic.twitter.com/dkFXz8WJeB
— ANI (@ANI) August 30, 2025
కాంగ్రెస్ నేతలు ఈ వివాదాన్ని బీజేపీ రాజకీయ కుట్రగా అభివర్ణించారు. దర్భంగా ఘటనలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బీజేపీ ఏజెంట్ అని, యాత్ర జనాదరణను అడ్డుకోవడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. అయితే, బీజేపీ నేతలు ఈ ఘటనను ఖండిస్తూ, రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన బీహార్ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను సృష్టించింది.
రాహుల్ చేపట్టిన ఈ యాత్ర బీహార్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నదని పలువురు అంటున్నారు. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌లతో పాటు ఇతర ఇండియా బ్లాక్ నేతలు ఈ యాత్ర ద్వారా ఓటర్లను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా రహుల్ చాక్లెట్ ఆఫర్ ఘటన.. రాహుల్ గాంధీ యాత్రకు సానుకూల దృష్టిని తెచ్చినప్పటికీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఘర్షణ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.