టీఎస్‌పీఎస్సీ నియామకాలు తుది తీర్పునకు లోబడే.. | Supreme Court Final Verdict on distance education degrees | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీ నియామకాలు తుది తీర్పునకు లోబడే..

May 5 2026 12:53 AM | Updated on May 5 2026 12:53 AM

Supreme Court Final Verdict on distance education degrees

దూరవిద్య డిగ్రీల చెల్లుబాటు కేసులో సుప్రీంకోర్టు స్పష్టికరణ 

తదుపరి విచారణ జూలై 29కి వాయిదా 

వర్సిటీల ప్రాదేశిక పరిధి, యూజీసీ నిబంధనలపై కీలక వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చేపట్టే నియామకాలు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దూరవిద్య ద్వారా పొందిన డిగ్రీల చెల్లుబాటు, తెలంగాణ వెలుపల ఉన్న విశ్వవిద్యాలయాల స్టడీ సెంటర్ల గుర్తింపునకు సంబంధించిన వివాదంపై దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్పి)పై జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్వీ అంజారియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 29కి వాయిదా వేసింది. ఈలోగా జరిగే నియామకాలు కేసు తుది తీర్పునకు లోబడే ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

2017 నోటిఫికేషన్‌లో ఆమోదం.. 2022లో తిరస్కరణ 
రాష్ట్రానికి చెందిన ఎ. విజయచంద్రారెడ్డి తదితరులు టీఎస్‌పీఎస్సీకి వ్యతిరేకంగా ఎస్‌ఎల్పీ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ 2014 రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ యూనివర్సిటీల స్టడీ సెంటర్ల ద్వారా విద్యార్థులు దూరవిద్యలో డిగ్రీలు పొందారని తెలిపారు. 2017లో టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఆ సర్టీఫికెట్లను ఆమోదించారని.. కానీ 2022 నోటిఫికేషన్‌లో యూజీసీ నిబంధనల ప్రకారం తెలంగాణ వెలుపల ఉన్న వర్సిటీల పరిధిలోకి వస్తాయనే కారణంతో వాటిని తిరస్కరిస్తున్నారన్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని.. ఈ డిగ్రీల ఆధారంగా అభ్యర్థులకు అవకాశం కల్పించాలని వాదించారు. ఈ వాదనలపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పాటైన విశ్వవిద్యాలయం కేవలం ఆ రాష్ట్ర భౌగోళిక పరిధి లోపలే పనిచేయాలి. ఆ రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను నిర్వహించడానికి వీల్లేదు’అని యూజీసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. దూరవిద్య ద్వారా పొందిన డిగ్రీలకు యూజీసీ లాంటి చట్టబద్ధమైన సంస్థల గుర్తింపు లేకుంటే ఆయా డిగ్రీలను విద్యాపరమైన అర్హతలుగా పరిగణించలేమని పేర్కొంది.

అలాగే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిందని.. అలాంటప్పుడు 2017 నుంచి 2020 మధ్య విద్యార్థులు తెలంగాణలో ఉంటూ వేరే రాష్ట్ర వర్సిటీల స్టడీ సెంటర్లలో ఎలా ప్రవేశాలు పొందారని, వాటికి గుర్తింపు ఎలా ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ప్రస్తుతానికి నియామక ప్రక్రియను నిలిపివేయబోమని.. కానీ నియామకాలన్నీ తమ తుది తీర్పునకు లోబడే జరుగుతాయని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement