Amritpal Singh పంజాబ్‌లోనే అమృత్‌పాల్‌ సింగ్‌.. పోలీసులకు లొంగిపోయే యోచనలో ఖలిస్థాన్ నేత!

Sources Says Amritpal Singh Plans To Surrender At Golden Temple - Sakshi

పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్‌ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‍పాల్ సింగ్ తిరిగి పంజాబ్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద పోలీసుల ముందు లొంగిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో భయంతో అమృత్‌పాల్‌.. చివరకు తన మనసు మార్చుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

పోలీసులకు లోంగిపోతాడనే ఊహాగానాల మధ్య  పరారీలో ఉన్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ బుధవారం వీడియో విడుదల చేశాడు. ఇందులో పంజాబ్‌ పోలీసులపై విమర్శలు గుప్పించాడు. ఒకవేళ పోలీసులకు తనను అరెస్టు చేయాలనే ఉద్దేశ్యం ఉంటే.. ఇంటికి వచ్చి అరెస్టు చేసేవారని అన్నాడు. తను అరెస్ట్‌కు భయపడే వ్యక్తి కాదని చెప్పాడు. పంజాబ్‌ ప్రభుత్వం నా అరెస్ట్‌ కోసం కాదు.. మొత్తం సిక్కు సమాజంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. 

అతని సన్నిహతులను అరెస్టు చేయడం, అస్సాం జైలులో వారిని నిర్బంధించడం గురించి కూడా వీడియోలో మాట్లాడాడు. ప్రజల మనస్సులలో ప్రభుత్వం సృష్టించిన భయాన్ని తొలగించడానికి బైస్కాహి సందర్భంగా తల్వాండి సబోలో సమావేశం నిర్వహించాలని అకల్ తఖ్త్ జాతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్‌ను అభ్యర్థించినట్లు  తెలిపాడు. పోలీసుల నుంచి పారిపోయిన తర్వాత వారిస్ పంజాబ్ దే చీఫ్ విడుదల చేసిన మొట్టమొదటి వీడియో ఇదే కావడం గమనార్హం. అయితే అమృత్‌పాల్ ఈ వీడియోలో ప్రత్యేక రాష్ట్రం లేదా ఖలిస్తాన్ గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు.

కాగా ఖలిస్తాన్‌ సానూభూతి పరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పోలీసులు 10 రోజులుగా విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఈ నెల 18వ తేదీన పంజాబ్‌ పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు వేషాలు మార్చకుంటూ పారిపోతున్నాడు. ఈ క్రమంలోనే రాష్ట్రం విడిచి వెళ్లిన్నట్లు గుర్తించారు. అయితే తాజాగా వారిస్ పంజాబ్ దే చీఫ్ మంగళవారం హోషియార్‌పూర్ మీదుగా అమృత్‌సర్‌కు వచ్చిన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

అమృతపాల్ సింగ్, అతని సహాయకులు మంగళవారం అర్థరాత్రి తర్వాత హోషియపూర్‌లోని ఓ గ్రామంలో దాక్కున్నారనే సమాచారంతో పంజాబ్ పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మార్నియన్ గ్రామంలోని గురుద్వారా వద్ద అమృతపాల్ సింగ్ ఇన్నోవా కారును వదిలిపెట్టి అక్కడి పొలాల్లోకి పారిపోయాడు. 

కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఖలిస్తాన్‌ నేత కోసం విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. అనుమానితుల్ని పట్టుకునేందుకు రోడ్లపై చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. గోల్డెన్ టెంపుల్ చుట్టూ, అకల్ తఖ్త్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. త్వరలోనే అతను లొంగిపోయే అవకాశం ఉన్నందున అమృత్‌సర్‌ అంతటా హై అలర్ట్‌ కొనసాగుతోంది.
చదవండి: 2025 కాదు 2050లో కూడా బీజేపీ గెలవదు.. కేజ్రీవాల్ జోస్యం..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top