
యాడ్స్‌లో తరచూ కనిపించిన సెలెబ్రిటీగా షారుఖ్
బ్రాండ్స్ పరంగా టాప్‌లో క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్.ధోని
టీవీ ప్రకటనల్లో ఆహారం, పానీయాలవే అత్యధికం
సాక్షి, స్పెషల్ డెస్క్: టీవీలో సినిమా అయినా, సీరియల్ అయినా.. నిమిషాల వ్యవధిలో ప్రకటనలు ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. ఏదైనా ఉత్పాదన జనంలోకి సులభంగా చొచ్చుకుపోవాలంటే ప్రముఖులు ఆమోదించాల్సిందే. ప్రముఖ నటుడు, బాలీవుడ్ బాద్‌షాగా పేరున్న షారూక్ ఖాన్ టీవీ ప్రకటనల్లో ఎక్కువగా కనిపించిన సెలబ్రిటీగా నిలిచారు. ఆ తరువాతి స్థానంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని ఉన్నారు.
టీఏఎం మీడియా రీసెర్చ్‌కు చెందిన యాడ్‌ఎక్స్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ కాలంలో ప్రసారం అయిన టెలివిజన్ ప్రకటనలలో షారూక్ ఖాన్ 8 శాతం వాటాతో అత్యధికంగా కనిపించిన సెలెబ్రిటీగా మొదటి స్థానంలో ఉన్నారు. వివిధ బ్రాండ్లకు సంబంధించి రోజుకు అన్ని చానెళ్లలో కలిపి సగటున ఆయన 27 గంటలు వీక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు.
7 శాతం వాటాతో తరువాతి స్థానంలో పోటీపడుతున్న ఎం.ఎస్.ధోని సగటున రోజుకు 22 గంటలు కనిపించారు. మొదటి పది స్థానాల్లో నిలిచిన ఇతర ప్రముఖులలో అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, అమితాబ్ బచ్చన్, అనన్య పాండే, రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ ఉన్నారు.
ఎక్కువ బ్రాండ్లతో ధోని
2025 మొదటి అర్ధభాగంలో టీవీల్లో ప్రసారం అయిన 43 బ్రాండ్ల ప్రకటనలతో ఎంఎస్ ధోని అగ్రస్థానంలో ఉన్నారు. షారూక్ 35, బిగ్ బి 28 బ్రాండ్స్ యాడ్స్‌లో దర్శనమిచ్చారు.
ఆహారం, పానీయాలు
సెలెబ్రిటీల యాడ్స్‌లో 23 శాతం వాటాతో తొలి స్థానంలో ఆహారం, పానీయాల రంగం ఉంది. వ్యక్తిగత సంరక్షణ, పరిశుభ్రత సంబంధ ఉత్పత్తులు 17 శాతం, గృహ ఉత్పత్తుల విభాగం 8 శాతం వాటాతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఉత్పత్తులవారీగా చూస్తే టాయిలెట్, ఫ్లోర్ క్లీనర్స్ 8 శాతం, శీతల పానీయాలు 6 శాతం, సబ్బులు 6 శాతం వాటాతో పోటీపడుతున్నాయి.
ప్రముఖుల యాడ్స్‌లో 40 శాతం వాటా కేవలం 10 రకాల ఉత్పత్తులదే. వీటిలో టాయిలెట్–ఫ్లోర్ క్లీనర్స్, శీతల పానీయాలు, వాషింగ్ పౌడర్స్–లిక్విడ్స్, నిర్మాణ సామగ్రి, పెయింట్స్, జీర్ణ సంబంధ ఉత్పత్తులు (డైజెస్టివ్స్), టూత్‌పేస్టులు, పాల ఆధారిత పానీయాలు ఉన్నాయి.
సినీతారలవే అధికం
టీవీలో ప్రసారం అయిన ప్రకటనలలో 29 శాతం వాటా సెలెబ్రిటీలది. సెలెబ్రిటీల ప్రకటనల్లో సినీ తారల వాటా ఏకంగా 74 శాతం ఉంది. క్రీడాకారులు 4 శాతం, టీవీ తారలు 3 శాతం ఉన్నారు. 2025 జనవరి–జూన్ లో సెలెబ్రిటీలతో కూడిన ప్రకటనల సంఖ్య 2023 జనవరి–జూన్ తో పోలిస్తే 12 శాతం, గత ఏడాదితో ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గాయి.
ఆన్ లైన్ గేమింగ్‌లో..
ఆహారం, పానీయాల యాడ్స్‌లో పురుష సెలెబ్రిటీలు ఎక్కువగా కనిపించగా, వ్యక్తిగతసంరక్షణ ప్రకటనల్లో మహిళా సెలెబ్రిటీలు ఆధిపత్యం చెలాయించారు. ఆన్ లైన్ గేమింగ్ విభాగంలో వచ్చిన ప్రకటనల్లో అత్యధిక సంఖ్యలో 38 మంది తారలు తళుక్కుమన్నారు. జంటలతో కూడిన యాడ్స్‌లో దీపికా పదుకోన్ –రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ–విరాట్ కోహ్లీలదే హవా. జంటల ప్రకటనల్లో వీరి వాటా దాదాపు 30 శాతం ఉంది. అక్షయ్ కుమార్–ట్వింకిల్ ఖన్నా, రణ్‌బీర్ కపూర్–ఆలియా భట్ సైతం యాడ్స్‌లో ప్రముఖంగా కనిపించారు.