
బీహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఈ పరిణామం అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర పాట్నా సభతో పూర్తి కానుంది. ఈ రోజు యాత్ర సరన్ జిల్లా చాప్రా నుంచి ప్రారంభమై, ఆరా, భోజ్‌పూర్ మీదుగా సాగింది. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ‘కాపీక్యాట్ సీఎంగా’ అభివర్ణిస్తూ ఆరాలో నిర్వహించిన ర్యాలీలో తేజస్వి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
నితీశ్ నా విధానాలను కాపీ కొడుతూ.. ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తేజస్వి ప్రజల్లోకి దూసుకుపోతుంటే.. ఈ ప్రభుత్వం మాత్రం వెనుకబడిపోయింది. మీకు సిసలైన సీఎం కావాలా? లేదంటే నకిలీ సీఎం కావాలా? అంటూ తేజస్వి మాట్లాడారు. తద్వారా తనను తాను సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ప్రకటించుకున్నట్లైంది. ఆ సమయంలో రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లు తేజస్విని చూస్తూ ఉండిపోయారు.
కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ.. బీహార్‌కు ఆర్జేడీనే పెద్దన్నగా తేజస్వి గతంలో వ్యాఖ్యానించారు. ఓటర్ అధికార్ యాత్రలో ఈ ఇద్దరు నేతలూ కలిసే ముందుకు సాగారు. కానీ ఎక్కడా కాంగ్రెస్‌గానీ, రాహుల్ గాంధీగానీ అధికారికంగా బీహార్ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై స్పందించలేదు. ఇదిలా ఉంటే..
కాంగ్రెస్-ఆర్జేడీ మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తాజాగా కథనం ఇచ్చింది. తాము ఆశించినన్ని సీట్లు ఆర్జేడీ ఇవ్వకపోవచ్చనే యోచనలో ఉన్న కాంగ్రెస్.. తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసేందుకు ముందుకు రావడం లేదన్నది ఆ కథనం సారాంశం.
2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక మహాఘట్‌బంధన్ కూటమి తరఫున కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీ చేసి.. కేవలం 19 స్థానాల్లో ెగ్గింది. అయితే ఈసారి కూడా అన్నే స్థానాలను కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ లేదంటే నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 35 ఏళ్ల తేజస్వి యాదవ్ గతంలో రెండుసార్లు డిప్యూటీ సీఎంగా పని చేశారు.
ఓటర్ అధికార్ యాత్ర బీహార్‌లో ఆరా (Ara) పట్టణంలో 2025 ఆగస్టు 30న జరిగింది. ఈ రోజు యాత్ర సరన్ జిల్లా చాప్రా నుంచి ప్రారంభమై, ఆరా, భోజ్‌పూర్ మీదుగా సాగింది.