
పని ప్రాంతాల్లో ఉద్యోగులపై ఒత్తిళ్లు సహజమే. అయితే ఆ ఒత్తిళ్లు ఈ మధ్యకాలంలో ఉద్యోగులను తీవ్ర నిర్ణయాల వైపు అడుగులేయిస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ బ్యాంకులో పని చేసే సీనియర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడడం.. అదీ బ్యాంకులోనే కావడం.. అందునా రాజీనామా చేసిన వారానికే కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శివశంకర్ మిత్రా.. మహారాష్ట్ర పుణే బారామతిలోని ఓ నేషనలైజ్డ్ బ్యాంకులో పని చేస్తున్నారు. 40 ఏళ్ల వయసులో పని ఒత్తిడి, అనారోగ్య కారణాలతో జులై 11వ తేదీన ఆయన తన చీఫ్ మేనేజర్ పోస్టుకు రాజీనామా చేశారు. అయితే ఏమైందో ఏమోగానీ నోటీసు పీరియడ్‌లో ఉన్న ఆయన అనూహ్యంగా ఘాతుకానికి పాల్పడ్డారు.
గురువారం రాత్రి బ్యాంకు నుంచి సిబ్బంది అందరూ ఇళ్లకు వెళ్లిపోయాక.. తాళాలు తాను వేస్తానంటూ వాచ్‌మెన్‌కు చెప్పి ఆయన ఒక్కరే లోపలే ఉండిపోయారు. అంతకు ముందే తనతో పాటు తెచ్చుకున్న తాడులో బ్యాంకులోపలే ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదంతా అక్కడి సీసీటవీ కెమెరాల్లో రికార్డయ్యింది.
భర్త ఇంటికి రాకపోవడం, ఫోన్‌కాల్స్‌కి ఎంతకీ స్పందిచకపోవడంతో ఆమె అనుమానంతో అర్ధరాత్రి బ్యాంకు వద్దకు చేరుకుంది. అందరూ వెళ్లిపోయి ఉంటారని వాచ్‌మెన్ చెప్పగా.. లోపల లైట్లు వేసి ఉండడంతో అనుమానంతో గేట్లు తీసి చూశారు. లోపల ఆయన ఫ్యానుకు విగతజీవిగా వేలాడుతూ కనిపించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో పని ఒత్తిడే కారణమని పేర్కొన్న ఆయన.. ఎవరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతేకాదు తన భార్య, బిడ్డలను క్షమాపణ కోరుతూ.. వీలైతే తన కళ్లను దానం చేయాలని నోట్‌లో కోరారాయన. దీంతో ఆ కుటుంబం విలపిస్తోంది. రాజీనామా చేసిన కొన్నిరోజులకే ఆయన ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో తోటి సిబ్బంది సైతం కంటతడి పెట్టారు.
కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఇదే పుణేలో ఈవై కంపెనీలో పని చేసే కేరళ యువతి అన్నా సెబాస్టియన్(26) పని ఒత్తిడి కారణంగా హఠాన్మరణం చెందింది. ఆమె తల్లి బహిరంగ లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. దేశంలో పని గంటలు, ఒత్తిళ్లు తదితర అంశాలపై విస్తృత చర్చ నడిచింది. అప్పటి నుంచి ఈ తరహా మరణాలు నెలలో కనీసం ఒకటి రెండైనా వెలుగు చూస్తున్నాయి. మొన్నటి మే నెలలో ఒలా ఏఐయూనిట్ కృత్రిమ్‌లో పని చేసే నిఖిల్ సోమవాన్షి ‘టాక్సిక్ వర్క్‌కల్చర్, పని ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడడం సైతం చర్చనీయాంశంగా మారింది.
ఈ తరహా మరణాలకు ప్రధాన కారణాలు
అత్యధిక పని గంటలు (55+ గంటలు/వారానికి)
అనియంత్రిత డెడ్‌లైన్లు
పరిమిత మానసిక ఆరోగ్య మద్దతు
ముఖ్యంగా హస్టల్ కల్చర్ (Hustle Culture) ప్రభావం.. అంటే విశ్రాంతికి చోటు లేకుండా టార్గెట్‌లు రీచ్ అయ్యేందుకు ఎప్పుడూ పని చేయాలనే మానసిక ధోరణి. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంతో పాటు ఆరోగ్యాన్ని పట్టించుకోరు.
Economic Times నివేదిక ప్రకారం, ఇండియాలో యువ ఉద్యోగులు అధిక పని గంటల వల్ల ఆత్మహత్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన EU నివేదిక ప్రకారం, వర్క్‌స్ట్రెస్ వల్ల ప్రతి సంవత్సరం 10,000 మంది మరణిస్తున్నారు.
ఆత్మహత్య అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు.. అలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. కౌన్సెలింగ్ సెంటర్‌లను ఆశ్రయించి సాయం పొందండి.
తెలంగాణలో..
రోషిణి కౌన్సెలింగ్ సెంటర్
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
ఆంధ్రప్రదేశ్‌లో..
1లైఫ్, ఫోన్ నెంబర్ 78930-78930; 100
జీజీహెచ్ కాకినాడ.. 98499-03870