#NoBindiNoBusiness: మరో వివాదంలో ఫ్యాబ్‌ఇండియా

Outrage Against Fabindia Diwali Ad Over Bindi For Business - Sakshi

మరో వివాదంలో ఫ్యాబ్‌ఇండియా

సాక్షి, ముంబై: పండుగలు అంటే సాంప్రదాయబద్దంగా జరుపుకుంటాం. ఎవరి మతాచారాలకు తగ్గట్టు వాళ్లు పండగలు చేసుకుంటారు. ఇక హిందూ పర్వదినాల విషయానికి వస్తే.. ముఖ్యంగా మహిళలు.. సాప్రదాయబద్దంగా తయారవడానికి ఇష్టపడతారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండుగనాడు మాత్రం పట్టుబట్టలు, బొట్టు, పూలు, గాజులతో అందంగా ముస్తాబవుతారు. ఆధునికంగా కనిపిస్తూనే సాంప్రదాయంగా తయారవుతారు. ఇక హిందూ సమాజంలో బొట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మిగతా రోజుల్లో ఎలా ఉన్న పండుగలు, పర్వదినాలు, శుభకార్యాల్లో తప్పనిసరిగా బొట్టు పెట్టుకుంటారు. 

అలాంటిది దీపావళి వంటి పర్వదినం నాడు ఏ భారతీయ మహిళ కూడా ఇలా తయారవదు అంటూ ఫ్యాబ్‌ఇండియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. కారణం ఏంటంటే దీపావళి సందర్భంగా ఫ్యాబ్‌ఇండియా తీసుకువచ్చిన దుస్తుల కలెక్షన్‌ యాడ్‌ ఇప్పటికే వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అది పూర్తిగా సద్దుమణగముందే మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఈ ఫ్యాబ్‌ఇండియా యాడ్‌లో మోడల్స్‌ ఎవరూ కూడా బొట్టు పెట్టుకోలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ఈ నేపథ్యంలో నుదుటన బొట్టు ధరించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. నోబిందినోబిజినెస్‌ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. 
(చదవండి: ఫ్యాబ్‌ ఇండియా యాడ్‌పై దుమారం, తొలగించిన సంస్థ)

ఈ యాడ్‌ చూసిన నెటిజనులు ఫ్యాబ్‌ ఇండియా యాడ్‌లో మోడల్స్‌ బొట్టు పెట్టుకోలేదని.. భారతీయ మహిళలు ఎవరూ పండగకి ఇలా తయారవ్వరని మండిపడుతున్నారు. అంతేకాక బిందీ, బొట్టుబిళ్లలు ధరించిన ఫోటోలు షేర్‌ చేస్తూ.. నోబిందినోబిజినెస్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్‌లో #Bindi, #NoBindiNoBusiness అనే హ్యాష్‌టాగ్‌లు ట్రెండ్‌ అవుతున్నాయి.
(చదవండి: ఫార్చ్యూన్‌ కొంపముంచిన గంగూలీ ‘గుండెపోటు’)

రానున్న దీపావళి సందర్భంగా రిలీజ్‌ చేసిన యాడ్‌పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేసిన తన కలెక్షన్‌ను జష్న్‌-ఈ-రివాజ్‌ పేరిట బ్రాండ్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. హిందూ పండుగల సందర్భంగా సెక్యులరిజాన్ని, ముస్లిం సిద్ధాంతాలను అనవసరంగా పెంపొందింస్తోందంటూ మండి పడ్డారు. దీంతో బాయ్‌కాట్‌ ఫ్యాబ్‌ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. 

చదవండి: కేవలం 'యాడ్స్‌'తో స్నేహ దంపతులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

మరికొందరు ఈ హ్యాష్‌ట్యాగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొట్టు పెట్టుకోకపోవడం పెద్ద నేరమేమి కాదు.. పుట్టుకతోనే ఎవరూ బొట్టుతో జన్మించలేదు. బొట్టు పెట్టుకోవాలో.. లేదో మేం నిర్ణయించుకుంటాం. దీనిలో పురుషుల జోక్యం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top