సీఎం కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌లకు నవీన్‌ పట్నాయక్‌ లేఖ

Odisha CM Naveen Patnaik Writes A Letter To Chief Ministers On Vaccination - Sakshi

దేశంలోని అన్ని ముఖ్యమంత్రులకు లేఖ

ఏకీకృత టీకాల కొనుగోలు విధానంపై
తీర్మానాలతో ముందుకు రావాలని విజ్ఞప్తి

భువనేశ్వర్‌: ‘దేశమంతా ఒక్కటై కరోనా మహమ్మారిని తరిమేద్దాం. ప్రజల ప్రాణాల్ని కాపాడుకుందాం. ఏకీకృత టీకాల కొనుగోలు విధానం పట్ల తీర్మానాలతో రాష్ట్రాలు ముందుకు రావాలని’ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అందరూ ముఖ్యమంత్రులకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు. కోవిడ్‌ టీకాల కోసం రాష్ట్రాల మధ్య పోరు తగదని హితవు పలికారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలువురు  ముఖ్యమంత్రులకు బుధవారం ఆయన లేఖలు రాశారు. రాజకీయ, ఇతర భేదాభిప్రాయాలకు అతీతంగా అందరం ఒక్కటై కరోనా మహమ్మారి పోరులో పాలుపంచుకుందాం. ఇంతకుముందు పలువురు ముఖ్యమంత్రులతో ఈ మేరకు ప్రత్యక్షంగా సంప్రదింపులు జరిపినట్లు లేఖలో పేర్కొన్నారు.

రోడ్డున పడుతున్న జీవితాలు
కరోనా మహమ్మారితో గత ఏడాది నుంచి ప్రపంచం తల్లడిల్లుతోంది. రెండు దశల్లో ప్రపంచ ప్రజల్ని కరోనా బెంబేలెత్తించింది. మూడో దశ ముంచుకొస్తోందనే ఆందోళన  మరింతగా భయపెడుతోంది. పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబం, తల్లిదండ్రుల్ని కోల్పోయి పిల్లలు అనాథలవుతున్నారు.  పరిశ్రమలు, వర్తక, వ్యాపారం, రవాణా రంగాలు కుదేలవడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఉపాధి వనరులు తగ్గిపోవడంతో పలువురి జీవితాలు రోడ్డున   పడుతున్నాయి.

టీకాతో సాధ్యం
కోవిడ్‌ టీకాతో కరోనా మహమ్మారిని తరిమి వేయడం సాధ్యం. పలు   దేశాలు కోవిడ్‌ టీకాలు ప్రయోగించి కరోనా విపత్తును  అణిచివేశాయి. దేశ ప్రజల ప్రాణ రక్షణకు కోవిడ్‌ టీకాల కార్యక్రమం దేశ వ్యాప్తంగా పూర్తి చేయాలి. ప్రజల బాగు కోసం అన్ని రాష్ట్రాలు  ఏకమై ఐక్య పోరాటానికి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరికీ సత్వరమే కోవిడ్‌ టీకాలు అందడమే ఉద్యమ ధ్యేయం. కోవిడ్‌ టీకాల జాతీయ ఉత్పాదన అరకొరగా ఉంది. ప్రపంచ ఉత్పాదక సంస్థల నుంచి టీకాలు కొనుగోలు   ఉద్యమానికి ఊపిరిపోస్తుంది. అంతర్జాతీయ కోవిడ్‌ టీకాల ఉత్పాదన సంస్థలు రాష్ట్రాలవారీ వ్యాపార ఒప్పందంపట్ల మొగ్గు కనబరచడం లేదు. కేంద్ర  ప్రభుత్వం ముందడుగు వేసి అంతర్జాతీయ ఉత్పాదన సంస్థల నుంచి  కోవిడ్‌ టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే  విధానం ఉత్తమం. స్థానిక అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా  టీకాల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు ముందే లేఖ రాసి అభ్యర్థించినట్లు  ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నవీన్‌ పట్నాయక్‌ వివరించారు. ఈ ప్రతిపాదనల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా స్పందించి తీర్మానాలు చేసి కరోనా తరిమివేతలో విజయం సాధించేందుకు ముందుకు రావాలని లేఖలో అభ్యర్థించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top