బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పదునైన ఆయుధాలతో ఇద్దరు గ్రామస్తులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్ల పిరికిపంద చర్య బయటపడింది. బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేల కాంకేర్‌లో మావోయిస్టులు ఆయుధాలతో ఇద్దరు గ్రామస్తులను హత్యచేశారు. హతులను తిరుపతి సోధి, రవి కట్టంగా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు అక్టోబర్ 13న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత పూనెం సత్యంను దారుణంగా హత్య చేశారు. అతను ఇన్ఫార్మర్ అని వోమావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో పూనెం సత్యం మృతదేహం దగ్గర మావోయిస్టులు ఒక కరపత్రాన్ని ఉంచారు.
దానిలో వారు పలు ఆరోపణలు చేశారు. ఈ హత్యకు మద్దీద్ ఏరియా కమిటీ ఆఫ్ నక్సలైట్స్ బాధ్యత వహించింది. కాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఈ లక్ష్యం మేరకు ప్రతి గ్రామంలో నిఘాను మరింత బలోపేతం చేస్తోంది. పోలీసు ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్‌ను పెంచుతోంది. వారిచ్చిన సమాచారం ఆధారంగా మావొయిస్టుల స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు.


