మావోయిస్టులకు భారీ దెబ్బ.. మల్లోజుల లొంగుబాటు | Maoist Leader Mallojula Venu Gopal Surrenders To Police, Declares Withdrawal From Party After Criticizing Movement | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు భారీ దెబ్బ.. పోలీసులకు లొంగిపోయిన కీలక నేత మల్లోజుల

Oct 14 2025 11:08 AM | Updated on Oct 14 2025 12:32 PM

Is Maoist Leader Mallojula Venugopal Surrender Full Details Here

మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ తగిలింది. కీలక నేత మల్లోజుల వేణుగోపాల్‌ ఎలియాస్‌ సోను పోలీసులకు(Mallojula Surrender News) లొంగిపోయారు. గచ్చిరోలి(మహారాష్ట్ర)లో 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఇయన ఇంతకాలం కొనసాగారు. అయితే.. ఇకపై పార్టీలో కొనసాగబోనని, అనివార్య కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు తాజాగా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. 

విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదంటూ తాజాగా ఆయన లేఖ రాయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని ఆయన గతంలో రాసిన లేఖను మిగతా అగ్రనేతలైన హిడ్మా, దేవ్‌జీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా వేణుగోపాల్‌ 22 పేజీల సుదీర్ఘ లేఖను ఈ మధ్యే విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆ లేఖలో సారాంశం ఇలా.. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యతవహిస్తూ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నా. ఇంతనష్టానికి, ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో కొనసాగడానికి ఇక ఎంతమాత్రం అర్హుడిని కాదని భావిస్తున్నా. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరైంది కాదని భావించవచ్చు. కానీ పరిస్థితులు దీన్ని అనివార్యంగా చేశాయి. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. 28 ఏళ్లు కేంద్ర కమిటీ, 18 ఏళ్లు పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పార్టీలో ఎన్నో లోపాలను గమనించాను. 

1998 నుంచి ఉమ్మడి ఏపీలో దెబ్బతింటూ వచ్చాం. 2003లో ఉత్తర తెలంగాణ నుంచి బలగాలను దండకారణ్యానికి తరలించాం. 2005 నాటికి ఏపీలో పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది. మన బలాన్ని ఎక్కువగా, ప్రత్యర్థి బలాన్ని తక్కువగా అంచనా వేయడం తప్పుడు నిర్ణయం. పార్టీ బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆదివాసీ రైతులకు ప్రభుత్వాలు ఇచ్చే భూమి పట్టాలు వద్దన్నాం. దీనికి ప్రతిగా జనతన సర్కారే పట్టాలిస్తుందని చెప్పాం. కానీ ఆ పట్టాలకు విలువలేదని, రైతుల అవసరాలు తీర్చలేవని కేంద్ర కమిటీ గ్రహించలేకపోయింది. జనతన సర్కారు బడుల్లో చదువులకు కూడా విలువ లేకుండా పోయింది. చివరకు ప్రజలు ఆధార్‌కార్డులు తెచ్చుకోవడాన్నీ వ్యతిరేకించాం. ప్రజలు చాటుగా వెళ్లి వాటిని తెచ్చుకున్నారు. 

పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత మల్లోజుల

ఇలాంటి తప్పులు సరిదిద్దుకోవాలంటే ప్రజల మధ్యకు వెళ్లాలి. ఇప్పుడు ఉద్యమాన్ని కాపాడుకోవడం, కేడర్‌ను రక్షించుకోవడం కావాలి. అనవసర త్యాగాలకు అంతం పలుకుతూ నూతన పద్ధతుల్లో పురోగమిస్తే అంతిమ విజయం ప్రజలదే. ఈ లేఖ పూర్తిగా చదివి, సహచరులతో చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా’ అంటూ తోటి మావోయిస్టు నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ లేఖను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయుధాలను సరెండర్‌ చేయాలని ఆయన్ని ఆదేశించింది. ఈ లేఖల యుద్ధం కొనసాగుతున్న తరుణంలోనే ఆయన పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఆయన ఆయుధాలు వదిలేసినట్లు గచ్చిరోలి అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement