లక్షద్వీప్‌ను ముంచేస్తారా?

Lakshadweep First Protest to Save the Island from Hindutva Politics - Sakshi

అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌పై పెరిగిపోతున్న వ్యతిరేకత

వివాదాస్పద నిర్ణయాలపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం

లక్షద్వీప్‌ని కాపాడమంటూ ఉద్యమం తీవ్రతరం

నేటి నుంచి ప్రఫుల్‌ వారం రోజుల పర్యటన

సేవ్‌ లక్షద్వీప్, గో బ్యాక్‌ ప్రఫుల్‌ నినాదాలతో ఇల్లిల్లూ మారుమోగిపోతోంది. సముద్ర జలాల్లో మునిగి మరీ నిరసన తెలుపుతున్నారు. దేశద్రోహం కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు కేంద్రం జీవాయుధాన్ని ప్రయోగించిందన్న దాకా పరిస్థితి వెళ్లిపోయింది . అసలు లక్షద్వీప్‌లో ఏం జరుగుతోంది? అడ్మినిస్ట్రేటర్‌ వివాదాస్పద నిర్ణయాలేంటి? ద్వీప సముదాయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ.  

అరేబియా సముద్రంలో ప్రశాంతంగా ఉండే పగడపు దీవుల్లో చిచ్చు రేగింది. అభివృద్ధి పేరుతో తీసుకున్న నిర్ణయాలు అలల్లో అలజడి రేపాయి. కేంద్రం నియమించిన అడ్మినిస్ట్రేటర్‌ ఏకపక్ష నిర్ణయాలు ఇప్పుడా దీవుల్ని నిండా ముంచేసేలా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ 2020 డిసెంబర్‌ 4 వరకు ఎంతో ప్రశాంతంగా ఉండేది. పెద్దగా వార్తల్లోకి వచ్చింది లేదు. అదే రోజు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ దినేశ్వర్‌ శర్మ మరణించడంతో కేంద్ర ప్రభుత్వం దాద్రా నాగర్‌ హవేలి అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ ఖోడా పటేల్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు అత్యంత సన్నిహితుడు...  గుజరాత్‌ మాజీ మంత్రి అయిన ప్రఫుల్‌ పటేల్‌ లక్షద్వీప్‌ని మాల్దీవుల్లా మార్చేస్తానంటూ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన ప్రతిపాదనలతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్థానిక యంత్రాంగంతో మాట మాత్రంగానైనా చర్చించకుండా తీసుకున్న నిర్ణయాలు తమ జీవన విధానం, సంస్కృతిని దెబ్బ తీస్తోందన్న ఆందోళనతో స్థానికులు ఉద్యమిస్తున్నారు. సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన లక్షద్వీప్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ రెగ్యులేషన్‌ (ఎల్‌డీఏఆర్‌) సంక్షోభంలోకి నెట్టేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

లక్షద్వీప్‌లో స్టార్‌ హోటళ్లు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ రిసార్టులు, హై ప్రొఫైల్‌æ బీచ్‌ ఫ్రంట్‌లు నిర్మిస్తే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగి ఉన్న దీవి కాస్తా పోతుందనే ఆందోళనలైతే ఉన్నాయి. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ లక్షద్వీప్‌ ప్రజలకు బాసటగా నిలిచారు. ప్రఫుల్‌ పటేల్‌ను తొలగించాలన్న డిమాండ్‌లో కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రతిపాదనల్ని నిలిపివేయాలని కోరింది. 36 మంది రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు ఈ అభివృద్ధి ప్రణాళికపై స్థానికులతో చర్చించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా లక్షద్వీప్‌ ప్రజలకి అండగా నిలబడి ప్రజా వ్యతిరేక విధా నాల్ని వెనక్కి తీసుకోవాలని ప్రధానికి లేఖ రాశారు.

నేడు లక్షద్వీప్‌కు ప్రఫుల్‌  
ఉద్యమం తారస్థాయికి చేరుకున్న వేళ తాను ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు ప్రఫుల్‌ పటేల్‌. సోమవారం నుంచి వారం రోజుల పాటు లక్షద్వీప్‌లో ఆయన పర్యటించనున్నారు. ద్వీపంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. విద్యుత్‌ ప్రైవేటీకరణ, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుపై మంతనాలు జరుపుతారు.

వివాదాస్పద నిర్ణయాలివే  
► గోవధపై నిషేధం, గోమాంసం అమ్మకం, రవాణా చేయకూడదు. అలా చేసిన వారికి ఏడాది జైలు, రూ.10 వేలు జరిమానా విధిస్తారు.
► తమ సంస్కృతి, ఆహారపు అలవాట్లపై దాడి అని స్థానికులు భగ్గుమంటున్నారు
► ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నప్పటికీ ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత పిల్లల్ని కనకపోతే పోటీ చేయొచ్చు.
► ఈ దీవుల్లో ఉండే అత్యధికులు ముస్లింలు కావడంతో వారికి పిల్లలు ఎక్కువ. అందుకే ఇక్కడ ముస్లిం జనాభాని టార్గెట్‌ చేశారన్న అసహనం వారిలో కనిపిస్తోంది.  
► మద్యంపై నిషేధం ఉన్నప్పటికీ జనాభా నివసిస్తున్న దీవుల్లో కూడా పర్యాటకులకు మద్యం సర్వ్‌ చేయడానికి అనుమతినిచ్చారు
► సమాజ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేవారికి వ్యతిరేకంగా గూండా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.  
► దేశంలోనే నేరాల రేటు అతి తక్కువగా ఉన్న దీవుల్లో ఇలాంటి కఠిన చట్టం అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అడ్మినిస్ట్రేటర్‌ని విమర్శించే వారిపైనే దీనిని ప్రయోగిస్తారన్న ఆందోళనలు నెలకొన్నాయి.  
► గత ఏడాది కాలంగా లక్షద్వీప్‌లో కఠినమైన కోవిడ్‌ నిబంధనలు పాటించడంతో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఆ ఆంక్షల్ని తొలగించడంతో 8 వేల వరకు కేసులు నమోదయ్యాయి. 30 మంది వరకు మరణించారు.  
► గ్రీన్‌ జోన్‌ ట్యాగ్‌ తొలగిపోవడంతో కోవిడ్‌ ఇంకెంత ప్రమాదకరంగా మారుతుందోనన్న భయం స్థానికుల్ని వెంటాడుతోంది.  
► ఈ దీవుల్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఎక్కడైనా భూముల్ని తీసుకునే అధికారాలు, అక్కడున్న వారిని ఖాళీ చేయించే అధికారం ఎల్‌డీఏఆర్‌కు కట్టబెట్టారు. మైనింగ్, క్వారీయింగ్‌ కూడా చేయొచ్చు. స్థానిక యంత్రాంగంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారీ కట్టడాలు వచ్చి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్న విమర్శలు వస్తున్నాయి.  
► వేటకు వెళ్లే మత్స్యకారుల పడవల్లో భద్రత కల్పించడానికి ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. ూ నేరుగా జనం కదలికలపై నిఘా పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని నిరసనలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.                                                                                                                             

లక్షద్వీప్‌ ప్రత్యేకతలు  
కేరళకు పశ్చిమాన 200 కి.మీ. దూరంలో ఉన్న లక్షద్వీప్‌ 32 ద్వీపాల సముదాయం. వాటిలో 10 ద్వీపాల్లో ప్రజలు నివసిస్తున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలోని మలబార్‌ జిల్లాలో అంతర్భాగంగా ఉండే లక్షద్వీప్‌కు 1956లో కేరళ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇచ్చారు. ఇక్కడ జనాభా కేవలం 65 వేలు. వారిలో 96 శాతం మంది ముస్లింలు. వీరు జాలర్ల వృత్తిలో ఉన్నారు. పశుమాంసమే వీరికి ఆహారం. వీరికి ఏదైనా కావాలంటే కేరళ రాష్ట్రం మీదే ఆధారపడతారు. కొబ్బరి చెట్ల పెంపకం, పర్యాటకం, పశుపోషణ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ రాజకీయ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడిప్పుడే తమ ఉనికిని చాటుకుంటున్నాయి. 2014 నుంచి ఎన్సీపీ నుంచి మహమ్మద్‌ ఫైజల్‌ ఎంపీగా ఉంటే పంచాయతీ మండళ్లలో కాంగ్రెస్‌కు పట్టు ఉంది.  

పర్యావరణం దెబ్బతింటుంది
లక్షద్వీప్‌ ఏమైపోతుందోనన్న ఆందోళన కలుగుతోంది. వాతావరణ మార్పులతో ఏడాది పొడవునా సముద్రం ఎప్పుడు చూసినా అల్లకల్లోలంగా ఉంటోంది. తుఫాన్లు పెరిగిపోతున్నాయి. పగడపు దిబ్బలు తరిగిపోతున్నాయి. 1998లో 51శాతం ఉన్న పగడపు దిబ్బలు 2017 నాటికి 11 శాతానికి తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో భవన నిర్మాణాలు, తవ్వకాలు చేపడితే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. పర్యావరణ సమతుల్యత దెబ్బ తిని ద్వీపం మునిగిపోయే ప్రమాదం ఉంది
– ప్రొఫెసర్‌ ఎస్‌.అభిలాష్, కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top