జైహింద్‌ స్పెషల్‌: మహోద్యమం.. ప్రకృతిసేద్యం

Jai Hind Story: Intensive Farming Method Story By Patangi Rambabu - Sakshi

పర్యావరణానికి నష్టదాయకంగా మారిన రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోకపోతే మరో 60 పంట కాలాల్లోనే ప్రపంచ దేశాల్లోని భూములన్నీ పంటల సాగుకు బొత్తిగా యోగ్యం కాకుండా పోతాయని ఎఫ్‌.ఎ.ఓ. హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరిక చేసి ఐదేళ్లు గడచింది. అయితే, ఈ గడువు అన్ని దేశాలకూ ఒకేలా లేదు. భారత్‌ వంటి ఉష్ణమండల దేశాలకు మిగిలింది మహా అయితే మరో 25 పంట కాలాలు మాత్రమే అంటున్నారు నిపుణులు!

భవిష్యత్తు..?
సమస్యను సృష్టించిన మూసలోనే ముందుకు వెళ్తే సమస్యకు పరిష్కారం దొరకదు. భిన్నంగా ఆలోచించాలి. వ్యవసాయ రంగంలో ఇప్పుడున్న సంక్షోభం ఆర్థికపరమైనదిగా పైకి కనిపిస్తుంది. కానీ, నిజానికి ఈ సంక్షోభం మూలాలు పర్యావరణంలో ఉన్నాయి. అంటే.. రసాయనాలపై ఆధారపడిన హరిత విప్లవం సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించడానికి రసాయన రహిత ప్రకృతి సేద్య పద్ధతులకు మళ్లటం తప్ప భవిష్యత్తులో సజావుగా మనుగడ సాగించడానికి మరో మార్గం లేదు. 

రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు అనేకం అందుబాటులో ఉన్నాయి. గందరగోళపడకుండా.. వాటిల్లో తగిన పద్ధతిని ఎంచుకొని ముందడుగెయ్యటంలోనే విజ్ఞతను చూపాలి. స్వయం ఉపాధి పొందుతున్న రైతు సర్వస్వతంత్రుడు. ఆ పంటపైనే ఆధారపడి వారి జీవనం సాగుతూ ఉంటుంది. 

అందువల్ల అలవాటైన రసాయనిక వ్యవసాయాన్ని, అది ఎంత భారంగా ఉన్నప్పటికీ, వదలి ప్రకృతి వ్యవసాయంలోకి రైతులు మారటం అంత తేలికేమీ కాదు. ఈ పరిణామక్రమం బలవంతంగా జరగకూడదు. రైతు ఇష్టపూర్వకంగా, భరోసాగా జరగాలి. చెబితే విని రైతులు మారరు. 

ఎవరైనా చేసి చూపిస్తే.. అప్పుడు నమ్మి ఆ పద్ధతిని అనుసరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతి చాలా మెరుగైన ఫలితాలను అందిస్తోంది. రైతులను దశల వారీగా, కొన్ని సంవత్సరాల కాలంలో ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లేందుకు ప్రోత్సహిస్తున్నారు. 

గ్రామస్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రదర్శన క్షేత్రాల ద్వారా చూపి, పొలంబడులతో నేర్పిస్తూ, అవసరమైన ఉపకరణాలను అందిస్తూ, ఏడాది పొడవునా సలహాలు, సూచనలు ఇచ్చే మద్దతు వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చారు. ఎకరం, అరెకరంతో ప్రారంభించి.. నెమ్మదిగా తమ పొలం మొత్తాన్నీ ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లిస్తున్న రైతులు ఎందరో ఇవ్వాళ కనిపిస్తారు. 

అదే గ్రామంలో రసాయనిక వ్యవసాయం చేసే వారికన్నా తక్కువ ఖర్చుతో, ఎక్కువ దిగుబడి తీస్తున్న సీనియర్‌ రైతులకూ కొదవ లేదు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం, సాగు నీటి వాడకం, సాగు విద్యుత్తు వాడకం కూడా తగ్గుతోంది. 

మరోవైపు ప్రకృతి ఆహారం తింటున్న వారి ఆరోగ్యం కుదుటపడుతోంది. రుగ్మతలు దూరమవుతున్నాయి. ఆహారమే ఔషధం అనే మాట మళ్లీ వినిపిస్తోంది. ఈ సానుకూల సంగతులను థర్డ్‌ పార్టీ పరిశోధనా సంస్థల అధ్యయనాలు నమోదు చేస్తున్నాయి. ఎఫ్‌.ఎ.ఓ., యు.ఎన్‌.ఇ.పి., సెస్‌ వంటి అనేక సంస్థలు నివేదికలు వెలువరిస్తున్నాయి. 

ఏపీ మార్గదర్శకం
జన్యుమార్పిడి లేదా జన్యు సవరణ వంటి క్షేమదాయకం అని రుజువు కాని ప్రమాదకర సాంకేతికతలు గానీ, రసాయనాల అవసరం గానీ బొత్తిగా లేకుండానే.. ఇప్పుడు అందుబాటులో ఉన్న వనరులతోనే వ్యవసాయ–ఆహార–ఆరోగ్య రంగంలో గొప్ప మౌలిక మార్పు తేవచ్చు అని ‘ఆర్బీకేల ఆధారిత ఆంధ్రప్రదేశ్‌ నమూనా ప్రకృతి సేద్య అనుభవాలు’ చాటి చెబుతున్నాయి. 

ప్రకృతి సేద్యంపై పరిశోధనలు చేపట్టేందుకు, ఉన్నత విద్యను అందించేందుకు ఇండో–జర్మన్‌ అకాడమీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్నీ త్వరలో ఏర్పాటు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఏపీ(6.5 లక్షల మంది రైతులు 2.8 లక్షల ఎకరాలలో) ప్రకృతి సాగు చేస్తూ మెరుగైన ఫలితాలను నమోదు చేస్తున్నది. 

ముందు నడచిన తోటి రైతుల నుంచే ఇతర రైతులు ప్రకృతి సేద్య విజ్ఞానాన్ని (ఫార్మర్‌ టు ఫార్మర్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ ్ఫర్‌) నేర్చుకుంటున్న తీరును భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాలూ గుర్తిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని దేశవ్యాప్తం చేయడానికి చర్యలు చేపట్టింది. 

వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సంస్థల దృష్టిని ప్రకృతి సేద్యం వైపు మళ్లించింది. అయితే, అప్పుడే అంతా అయిపోలేదు. కథ ఇప్పుడే మొదలైంది. మౌలిక మార్పు దిశగా పాలకులు, శాస్త్రవేత్తలు, రైతులు, వినియోగదారులు అడుగులు వేయాల్సి ఉంది. 

భారతీయ రైతులకు రసాయనాలు విక్రయిస్తూ ఏటా రూ. లక్షల కోట్లు గడిస్తున్న దేశ విదేశీ బహుళజాతి కంపెనీల లాబీయింగ్‌ను మన రైతులు, మన పాలకులు ఎంత దీటుగా తట్టుకొని నిలబడి ముందడుగు వేయగలరన్న దాన్ని బట్టి ప్రకృతి సేద్యం దేశ విదేశాల్లో ఎంత వేగంగా విస్తరిస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. 

– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్ట్‌
prambabu.35@gmail.com

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top