40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్‌ వ్యవస్థకు గుడ్‌బై  | Indian Railways to begin migration to new reservation system from August 2026 | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్‌ వ్యవస్థకు గుడ్‌బై 

May 9 2026 4:27 AM | Updated on May 9 2026 4:27 AM

Indian Railways to begin migration to new reservation system from August 2026

ఆగస్ట్‌లో అందుబాటులోకి కొత్త విధానం 

ప్రయాణికులకు మరింత సులభతరం చేస్తూ మార్పులు

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే గత 40 ఏళ్లుగా అమలు చేస్తున్న ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ (పీఆర్‌సీ)కి త్వరలో గుడ్‌బై చెప్పనుంది. ఆగస్ట్‌ నుంచి ఆధునిక సాంకేతికతతో రూపొందించిన అప్‌గ్రేడెడ్‌ రిజర్వేషన్‌ విధానానికి మారనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 

ఈ మార్పుల సమయంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రయాణికుల అభిప్రాయాలను సైతం ప్రస్తుతం వాడుతున్న రైల్‌ యాప్‌ల ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అందరికీ అనుకూలంగా, అత్యంత సులువైన విధానాన్ని తెచ్చేందుకు రైల్వే శాఖ రిజర్వేషన్‌ ప్రక్రియకు మార్పులు చేస్తోంది. ఇందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకుంటోంది. 

1986లో ప్రారంభమైన రిజర్వేషన్‌ 
భారతీయ రైల్వేల్లో ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ 1986లో ప్రారంభమైంది. అప్పటి నుంచి పలు దశల్లో సాంకేతిక నవీకరణలు చేపట్టినా, ప్రస్తుతం పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయి అప్‌గ్రేడ్‌ అవసరమైంది. దేశవ్యాప్తంగా టికెట్‌ బుకింగ్‌ డిమాండ్‌లో ప్రస్తుతం 88 శాతం వరకు ఆన్‌లైన్‌ సేవల ద్వారానే నెరవేరుతోందని రైల్వే శాఖ తెలిపింది. తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ సమయంలో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 10గంటలకు ఏసీ, 11 గంటలకు స్లీపర్‌ క్లాస్‌లకు సంబంధించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటోంది. 

ఐదు నిమిషాల ముందే యాప్‌ ఓపెన్‌ చేస్తుండగా.. యాప్‌ ఓపెన్‌ అవ్వకపోవడం, ఓపెన్‌ అయ్యాక బఫర్‌ అవ్వడం వంటి సమస్యలను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. టిక్కెట్‌ బుక్‌ చేసి పేమెంట్‌ చేశాక కూడా కన్ఫర్మేషన్‌ అని చూపించేందుకు నిమిషాల వ్యవధి తీసుకుంటోంది. ఈ ప్రక్రియలో ఒక్కోసారి టిక్కెట్‌ క్యాన్సిల్‌ అని కూడా వస్తోంది. ఇటువంటి సమస్యలను అధిగమించేలా కొత్త రిజర్వేషన్‌ విధానం ఉండాలని అధికారులకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదేశాలు ఇచ్చారు. అందుకే పాత పద్దతికి చెక్‌ పెట్టి అందరూ మెచ్చేలా కొత్తదనంతో ముందుకు రావాలని సన్నహాలు చేస్తోంది.  

టికెట్‌ కన్ఫర్మేషన్‌ను అంచనా వేస్తున్న ఏఐ 
2025లో ప్రారంభించిన రైల్వే సూపర్‌ యాప్‌ ‘రైల్‌వన్‌’ప్రస్తుతం ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్ల కన్ఫర్మేషన్‌పై కచ్చితమైన అంచనాలు ఇస్తోంది. ప్రయాణికుడు టికెట్‌ బుక్‌ చేసిన వెంటనే అది కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలపై యాప్‌ సూచనలు అందిస్తోంది. రైల్వే శాఖ ప్రకారం వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్‌ కన్ఫర్మేషన్‌ అంచనా కచ్చితత్వం గతంలో 53 శాతం ఉండగా, ఏఐ వినియోగంతో ఇప్పుడది 94 శాతానికి పెరిగింది.

ఒకే యాప్‌లో అన్ని సేవలు 
‘రైల్‌ వన్‌’యాప్‌లో రిజర్వుడ్, అన్‌రిజర్వుడ్, ప్లాట్‌ఫామ్‌ టికెట్ల బుకింగ్, క్యాన్సిలేషన్, రీఫండ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ట్రైన్‌ లైవ్‌ రన్నింగ్‌ స్టేటస్, ప్లాట్‌ఫాం సమాచారం, కోచ్‌ పొజిషన్, ట్రైన్‌ టైమ్‌టేబుల్, ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారానికి ‘రైల్‌ మదద్‌’వంటి సేవలు కూడా అందిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఈ యాప్‌ ద్వారా సుమారు 9.29 లక్షల టికెట్లు బుక్‌ అవుతున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. వీటిలో 7.2 లక్షల అన్‌రిజర్వుడ్‌ టికెట్లు, 2.09 లక్షల రిజర్వుడ్‌ టికెట్లు ఉన్నాయి. అన్‌రిజర్వుడ్‌ టికెట్లలో ప్లాట్‌ఫాం టికెట్లు కూడా ఉన్నాయి. ఈ యాప్‌ను ఇప్పటివరకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో 3.16 కోట్ల సార్లు, ఆపిల్‌ పరికరాల్లో 33.17 లక్షల సార్లు డౌన్‌లోడ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement