
నా దగ్గర నిధులు లేవు, నేనేం కేంద్రంలో మంత్రినీ కాను.. అయినా సరే కేంద్రం నుంచి వరద బాధిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాను’ అంటూ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. తన మండీ నియోజకవర్గంలో వ్యాఖ్యలు చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కారణంగా వరదలు సంభవించి 14 మంది మృతిచెందారు. మరో 31 మంది గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో మండీ ఎంపీ కంగనా రనౌత్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు క్యాబినెట్ పదవి లేదని, విపత్తు సహాయానికి తన దగ్గర నిధులు లేవని, అయినా కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందించేందుకు తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు.
ఇంతటి వరదలకు బాధ్యులైనవారు తమ ముఖాలను దాచుకుంటున్నారని, వారు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్‌పై కంగనా విమర్శలు గుప్పించారు. విధాన రూపకల్పనలో తనకు సామర్థ్యం ఉందని, అయితే రాష్ట్ర స్థాయిలో లేదా పంచాయతీ స్థాయిలో అది చాలా తక్కువని కంగనా పేర్కొన్నారు.
#WATCH | Himachal Pradesh: BJP MP from Mandi, Kangana Ranaut says, "The central government provided immediate relief operations by sending in the forces. At the local level, we provided relief material to the affected families... Even though the Prime Minister is on a foreign… https://t.co/VoW4I4Uh4X pic.twitter.com/G9BeCHHTjF
— ANI (@ANI) July 6, 2025
హిమాచల్ ప్రదేశ్‌కు రక్షణ దళాలను పంపడం ద్వారా కేంద్రం తక్షణ సహాయ కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఇక్కడి పరిస్థితి గురించి తెలుసునని ఎంపీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తాము సహాయ సామగ్రిని అందించామని, ఒక ఎంపీగా నిధులు తీసుకురావడం, ప్రభుత్వానికి గ్రౌండ్ రియాలిటీని తెలియజేయడం తన పని అని ఆమె స్పష్టం చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే 20 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రనౌత్ వ్యాఖ్యానించారు. కాగా కంగనా.. విపత్తుల సమయంలో మండీ ప్రజలకు అందుబాటులో లేరంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించిన అనంతరం ఆమె ఈ ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఒక ఎంపీగా ఆమె ఇటువంటి మాటలు మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. స్థానికంగా సాయం అందించేందుకు ఒక ఎంపీకి అవకాశమే ఉండదా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: భారత్-పాక్‌లను ఒకేలా తూచలేం: ‘బ్రిక్స్’లో ప్రధాని మోదీ