బాక్సింగ్ దిగ్గజం ఆసక్తికర వీడియో షేర్ చేసిన హర్ష్ గోయెంకా

ముహమ్మద్ ఆలీ.. బాక్సింగ్ దిగ్గజం. 20వ శతాబ్దంలో ‘ది గ్రేటెస్ట్’ గుర్తింపు ఉన్న ఆటగాడు. ఇవన్నీ కాదు.. ఛాంపియన్‌కి పర్యాయ పదం ఈ లెజెండ్. రింగ్‌లో ప్రత్యర్థిని పిడిగుద్దులతో అగ్రెస్సివ్‌గా మట్టికరిపించే ఆలీ.. ప్చ్.. తన వీక్‌నెస్‌కు లొంగిపోయి అతని చేతిలో ఓటమి పాలయ్యాడు.
పిల్లలు దేవుళ్లు.. ఒక్కటే అంటారు. అందుకే బోసి నవ్వుల దేవుళ్లంటూ పిల్లల్ని అభివర్ణిస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్లు చేసే పనులు చూడముచ్చటగా ఉంటాయి కూడా. అందుకే పిల్లలంటే ఆలీకి బాగా ఇష్టం. వాళ్ల అల్లరిని భరించడంలో ఆయన దిట్ట. అలా ఓ చిన్నారి చేష్టలకు మురిసిపోయే.. ఆలీ పిడిగుద్దులు తిన్నాడు.
బాక్సింగ్ గ్లౌజ్‌లు వేసుకున్న ఆ బుడ్డోడు.. ఆలీ యాక్టింగ్‌ను ఎంజాయ్ చేశాడు. ఆలీ నాలిక బయటపెట్టి రెచ్చగొడుతుంటే.. ఎగబడి మరీ గుద్దేశాడు. చివరికి ఆలీ ఓడిపోయినట్లు రెఫరీ ఆ బుడ్డోడి చేతిని పైకి ఎత్తి అభినందించడంతో.. చేతుల్ని ప్రొఫెషనల్ బాక్సర్‌లాగా కొట్టుకుంటూ బిల్డప్ ప్రదర్శించాడు. అది చూసి.. ఓ ముద్దు పెట్టమంటూ ఆలీ కోరగా.. ‘ఎలాగూ ఓడిపోయాడు కదా! ఓ ముద్దిస్తే ఏమవుతుంది పోనీలే.. అనుకుంటూ ఆలీ ముచ్చటను తీర్చేశాడు ఆ బుడ్డోడు.
The best boxing match I have witnessed #MuhammadAli
pic.twitter.com/etQXR7qVJ1— Harsh Goenka (@hvgoenka) February 24, 2022
పారిశ్రామికవేత్త హార్ష్ గోయెంకా ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘నేను చూసిన బెస్ట్ బాక్సింగ్ మ్యాచ్ ఇదే’ అంటూ క్యాప్షన్ ఉంచారు. గోయెంకా పోస్ట్‌కి విపరీతంగా లైకులు, కామెంట్లు వచ్చిపడుతున్నాయి. అయితే తరచూ ఇది సోషల్ మీడియాలో కనిపించే వీడియోనే అనుకోండి.
సంబంధిత వార్తలు