
భారత్.. ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ సంపదలో ప్రజల మధ్య అంతరం మాత్రం నానాటికీ పెరుగుతోంది. ఇక పేదరిక నిర్మూలన అనేది సుదూర కల. ఎందుకంటే.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా చెప్పుకుంటున్న జీడీపీ వృద్ధిరేటు ఈ అసమానతలను తగ్గించడం లేదు.
దీంతో ఆదాయ ఆసమానతలను రూపుమాపకుండా పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యం కాదని తేలిపోయింది. జీడీపీలో పెరుగుదల ఉన్నప్పటికీ నిరుద్యోగం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉచిత ఆహార పథకం మీద 81 కోట్ల మంది ఆధారపడి ఉన్నారంటే.. దేశ ఆర్థిక పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే.. కార్మి క చట్టాల అమలుతోపాటు అనేక చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ధనిక దేశంలో పేద విధానాలు
దేశంలో విధానపరమైన లోపాలు పేద, ధనిక అంతరాన్ని మరింత పెంచుతున్నాయి. ఆర్థిక వృద్ధిలో అగ్రవాటా దేశంలోని కేవలం 5శాతం మందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకొంటున్న భారత్‌లో.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద.. 81.35 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు చెల్లించాల్సి వస్తుందంటే మన అభివృద్ది నమూనా ఎలాంటిదో అర్థమవుతుంది.
అమలు కాని కనీస వేతన చట్టం..
కనీస వేతనాల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది బహిరంగ రహస్యం. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్‌ఐ) చట్టాల కింద యజమానులు సమర్పించిన రిటర్న్‌లు చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఇంకా కొన్ని విభాగాల్లోని కార్మికులు ఈ రెండింటిలో నమోదే కాలేదు. 1970 కాంట్రాక్ట్ లేబర్ నియంత్రణ, రద్దు చట్టం వచ్చింది. కానీ.. ఐదు దశాబ్దాలైనా పరిశ్రమల్లో అమలు కాలేదు. అంతర్–రాష్ట్ర వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భలంగా ఉంది. సమాన పనికి సమాన వేతనం, ప్రయాణ చెల్లింపులు, వసతి, ఉచిత వైద్య సౌకర్యాలు వంటివి కాగితాలకే పరిమితమయ్యాయి.
చెల్లింపులో లింగ అంతరం..
వేతనాల్లో స్త్రీ, పురుషుల మధ్య అంతరం కొనసాగుతూనే ఉంది. జెండర్‌తో సంబంధం లేకుండా సమాన పనికి సమాన వేతనం అందించాలని 1976 సమాన వేతన చట్టం చెబుతున్నా... దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తీర్పులున్నా.. వివక్ష కొనసాగుతూనే ఉంది. అన్ని రంగాలలో మహిళలు ఒకే పనికి పురుషుల కంటే తక్కువ సంపాదిస్తూనే ఉన్నారు. ఈ అంతరాలు పోవాలంటే.. విధానాలు, చట్టాల అమలులో కఠినంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
అపరిమిత పని గంటలు..
దేశంలో జీడీపీ పెరుగుదల ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంది. 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారిలో నిరుద్యోగిత రేటు పట్టణ ప్రాంతాల్లో 17.9%, గ్రామీణ ప్రాంతాల్లో 13.7% ఉందని గణాంకాల మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం మే నెలలో తెలిపింది. కార్మికులకు 8 పని గంటలకోసం ఎన్ని ఉద్యమాలు జరిగాయో తెలిసిందే. అయినా.. ఇప్పటికీ అసంఘటిత, అనధికారిక రంగాల్లోని కార్మికులు రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేస్తారు. వీటికి అదనపు చెల్లింపులేమీ ఉండవు. చట్టం ప్రకారం రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికుల పని గంటలను రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలకు పరిమితం చేస్తే ఎక్కువ మందికి ఉపాధిని కల్పించవచ్చు.
పేదరికాన్ని తగ్గించాలంటే..
కనీస పెన్షన్‌ను పెంచాలంటున్నారు నిపుణులు. 2004లోనే స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ దీనిని సిఫార్సు చేసింది. రెండు దశాబ్దాలు దాటినా.. పెన్షన్ రూ.1,000 దగ్గరే ఉంది. కొన్ని రాష్ట్రాలు సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న సామాజిక పెన్షన్ రూ. 4,000 కంటే కూడా చాలా తక్కువ. ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్లు డిమాండ్ చేసినట్లుగా రూ. 7,000కి పెంచడం వల్ల లక్షలాది మంది జీవిత చరమాంకంలో గౌరవంగా జీవించగలుగుతారు. ఉపాధి హామీ పథకం పని రోజులను 150కి పెంచాలని, వేతనాన్ని రూ.400కు పెంచాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని సూచిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్