ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచేనో? | Sakshi
Sakshi News home page

ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచేనో?

Published Fri, Feb 26 2021 7:57 PM

Five Assembly Elections: Which Party Will Be Win - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత కీలక రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. వీటితో పాటు అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటికి షెడ్యూల్‌ విడుదల కావడంతో ఆయా రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కెంది. 

పశ్చిమబెంగాల్‌
ఈ ఎన్నికలను జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే నరేంద్ర మోదీకి పోటీగా ఎదగాలనుకుంటున్న మమతా బెనర్జీకి ఈ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు శక్తియుక్తులు పెడుతోంది. మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనే పట్టుదలతో మమతా బెనర్జీ దూకుడుగా వెళ్తున్నారు. అయితే కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్‌లో మమతాకు పరిణామాలు గడ్డుగా తయారయ్యాయి. ఈసారి ప్రధాన పోటీ బీజేపీతోనే ఉండనుంది.

కమ్యూనిస్టులను అణగదొక్కిన మమతా కమలదళాన్ని రాష్ట్రంలో అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీకి అనూహ్యంగా బలం పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీకి పోటీగా బీజేపీ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు తృణమూల్‌లోని ప్రధాన నాయకులందరూ కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే మమతకు పోరాటం కొత్తేం కాదు. ఎంతమంది వెళ్లినా ఆమె ఒంటిచేత్తో సత్తా చాటగల ధీరశాలి.. అపర కాళీగా పేరు ఉంది. దీంతో బీజేపీకి ధీటుగా ప్రచారం చేసి పదేళ్ల తన పాలనను వివరించడంతో పాటు మోదీ పాలనను ఎండగడుతూ ఎన్నికలకు మమత వెళ్తున్నారు. అయితే పదేళ్ల మమత పాలన వైఫల్యాలను ఎండగడుతూనే మోదీ చరిష్మాను ఈ ఎన్నికలకు వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే తృణమూల్‌లోని కీలక నాయకులను పార్టీలో చేర్చుకుని మమతకు పెద్ద దెబ్బ కొట్టారు. ఇక ఎన్నికల్లోనూ ఇలాంటి చావుదెబ్బ టీఎంసీకి తప్పదని కమల దళం భావిస్తోంది. 

తమిళనాడు
తొలిసారిగా తమిళ రాజకీయాల్లో ఉద్ధండ నాయకులైన జయలలిత, కరుణానిధి లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళ రాజకీయాలను ఇప్పటివరకు జాతీయ పార్టీలు అంతగా ప్రభావితం చేయలేదు. కానీ ఈసారి ఆ పరిస్థితి మారేలా కనిపిస్తోంది. ముఖ్యంగా నాయకత్వ లేమి అనేది తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తోంది. జయలలిత ఆకస్మిక మరణంతో అన్నాడీఎంకే, కరుణానిధి మృతితో డీఎంకేలు డీలా పడ్డాయి. శ్రేణులను నడిపించే నాయకత్వం లేదు. అన్నాడీఎంకేలో వర్గ విబేధాలు తారస్థాయిలో ఉన్నాయి. పైకి విబేధాలు లేవని చెబుతున్నా ముఖ్యంగా పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయి. పదేళ్లుగా అధికారానికి దూరమైన డీఎంకే శ్రేణులు నిరాశలో ఉన్నారు. స్టాలిన్‌ ఉన్నా అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు.

ఇక ఇటీవల జైలు నుంచి వచ్చిన జయలలిత స్నేహితురాలు శశికళ ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అన్నాడీఎంకేను చీల్చే అవకాశం ఉంది. అన్నాడీఎంకే, డీఎంకే మధ్యలో శశికళ వర్గం లబ్ధి పొందేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే అన్నాడీఎంకేకు పరోక్షంగా బీజేపీ మద్దతు తెలుపుతోంది. జయలలిత మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీ పాత్ర ఉందని అందరికీ తెలిసిన రహాస్యమే. ఇప్పుడు కూడా అన్నాడీఎంకే రహాస్య సంబంధాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్‌ ప్రభావం అంతంతగానే ఉండవచ్చు. 

అయితే ఈ నడిమధ్యలో సినీ నటులు కమల్‌హాసన్‌ ఉన్నా అతడి ప్రభావం ఏం ఉండకపోవచ్చు. రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం చేసి ఉంటే తమిళ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం ఉండేది. అయితే ఈ ఎన్నికల్లో రజనీ ఎవరికి మద్దతు తెలుపుతారనే అంశం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. 

కేరళ
దక్షిణాదిలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా కేరళను చెబుతారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. సీపీఎంతో కూడిన కూటమి పాలన సాగిస్తోంది. ఇక్కడ మళ్లీ పినరయి విజయనే అధికారంలోకి వచ్చేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. రాహుల్‌గాంధీ విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపుతున్నారు. సీపీఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్‌ లేదా కాంగ్రెస్‌తో కలిసి ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఈసారి ఎలాగైనా ప్రభావం చూపాలని తహతహలాడుతోంది. గత ఎన్నికల్లో ఒక స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

అస్సాం
ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో సత్తా చాటి అధికారం చేపట్టిన బీజేపీ ఈసారి కూడా అదే ఊపుతో కొనసాగే అవకాశం ఉంది. మోదీ చరిష్మా, ఐదేళ్ల పాలనను వివరిస్తూ బీజేపీ ఎన్నికలకు వెళ్తుండగా.. కాంగ్రెస్‌ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మోదీ పాలనలో జరుగుతున్న పరిణామాలు, జాతీయ అంశాలను కీలకంగా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో సత్తా చాటితే భవిష్యత్‌లో ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉంది.

పుదుచ్చేరి
కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిఫారసు చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి. నువ్వానేనా అన్నట్టు రెండు జాతీయ పార్టీల మధ్య రాజకీయం నడిచే అవకాశం ఉంది.

2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
పశ్చిమ బెంగాల్‌: 294 స్థానాలు
టీఎంసీ- 211
వామపక్షాలు- 79
బీజేపీ-3
ఇతరులు-1
పుదుచ్చేరి: 30 స్థానాలు
ఏఐఎన్‌ఆర్‌సీ-8
కాంగ్రెస్‌-17
ఏడీఎంకే-4
ఇతరులు-1
అసోం: 126 స్థానాలు
కాంగ్రెస్‌- 26
బీజేపీ+: 86
ఏఐడీయూఎఫ్‌-13
ఇతరులు-1
తమిళనాడు: 234
ఏడీఎంకే- 136
డీఎంకే+: 98

కేరళ: 140 స్థానాలు
ఎల్డీఎఫ్‌: 91
యూడీఎఫ్‌: 47
బీజేపీ:1
ఇతరులు: 1

Advertisement
 
Advertisement