అక్కడే చనిపోతామనుకున్నాం.. భారత్‌ చేరిన సూడాన్‌ బాధితులు

First Group Of Indians Landed In Delhi From Sudan - Sakshi

ఢిల్లీ: సుడాన్‌(sudan)లో చిక్కుకున్న భార‌తీయుల త‌ర‌లింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. సూడాన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‍కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ కావేరి’ వేగంగా కొనసాగుతోంది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సూడాన్‌ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్‌.. స్వదేశం చేరుకున్నారు. ఈ సందర్బంగా అక్కడ నెలకొన్న పరిస్థితులను వివరించారు. 

కాగా, మొదటి బ్యాచ్‌లో సూడాన్ నుంచి 360 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. మొత్తంగా జెడ్డాకు చేరుకున్న 534 మందిలో 360 మంది వాణిజ్య విమానంలో బుధవారం రాత్రి ఢిల్లీకి వచ్చేశారు. ఆపరేషన్ కావేరీ సాయంతో సూడాన్‌ నుంచి మొదటి బ్యాచ్ న్యూఢిల్లీకి చేరుకుంది అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. జైశంకర్ తన సౌదీ అరేబియా కౌంటర్‌తో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తరలింపు ప్రక్రియ ప్రారంభించారు.

మరోవైపు.. బుధవారం ఉదయం సుడాన్‌ నుంచి మూడో బ్యాచ్‌ కూడా బయల్దేరింది. ఈ విషయాన్ని విదేశీవ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. సుడాన్‌ నుంచి మూడో బ్యాచ్‌లో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు తెలిపారు. కాగా, సూడాన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన భారతీయులను స్వరాష్ట్రాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 

ఇదిలా ఉండగా.. స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల్లో చాలా మంది గాయపడ్డారు. అనంతరం, ఢిల్లీలో వారు సూడాన్‌లో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. సూడాన్‌లో నివాసాలపై బాంబు వేయడంతో భయానక పరిస్థితులను చూశాడు. స్వదేశానికి తిరిగి వస్తామని అనుకోలేదు. అక్కడే చనిపోతామనే భయంతో క్షణక్షణం కాలం గడిపాము. కట్టుబట్టలతో సూడాన్‌ నుంచి బయలుదేరాము. బాంబు దాడుల కారణంగా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాము. కొందరు వ్యక్తులు మమ్మల్ని గన్‌తో బెదిరించి మావద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారు. 

ఇది కూడా చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారు.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top