మాస్కే మన వ్యాక్సిన్‌

CSIR-CCMB working on three varied potential COVID-19 vaccine platforms - Sakshi

టీకాపై అతిగా ఆధారపడొద్దు

సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నిరోధానికి టీకాపై అతిగా ఆధారపడటం తగదని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా స్పష్టం చేశారు. టీకా రాకపోయినా దాన్ని ఎదుర్కోవడం ఎలా అనే దానిపై దృష్టి పెట్టాలని సూచించారు.  వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు తుది దశలో ఉన్నప్పటికీ వాటి సామర్థ్యం తెలియాలంటే మరికొంత సమయం పడుతుందని అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు.

‘సమర్థంగా పనిచేసే టీకా అందుబాటులోకి వస్తే సరి. లేదంటే భౌతిక దూరం, చేతులు  శుభ్రం చేసుకోవడం బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వేసుకోవడం వంటి చర్యల ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చు’అని వివరించారు. ముఖానికి తొడుక్కునే మాస్క్‌.. వ్యాక్సిన్‌ లాంటిదే అనే విషయం గుర్తించాలని పేర్కొన్నారు. కరోనా రక్షణ చర్యలన్నీ పాటిస్తే కొంత కాలానికి నిరోధకత ఏర్పడుతుందని, తద్వారా సహజ సిద్ధంగానే వైరస్‌కు చెక్‌ పెట్టొచ్చని చెప్పారు.

అతి తక్కువ సమయంలో ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పలు విధానాలు అందుబాటులోకి రావడం, అందరూ కలసికట్టుగా కృషి చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఒకవేళ టీకా అందుబాటులోకి వచ్చినా దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి అందించేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని పేర్కొన్నారు. అలాగే టీకా ఇచ్చినా దాని ప్రభావం ఎంత కాలం పాటు ఉంటుందో కూడా తెలియదని, ఆ విషయం తెలుసుకునేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని వివరించారు. అప్పటివరకూ ప్రస్తుతం పాటిస్తున్న అన్ని రకాల జాగ్రత్తలను కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

‘మిషన్‌’కు రూ. 50 వేల కోట్లు!
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలకు అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఒక్కో వ్యక్తికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి 6 నుంచి 7 డాలర్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో ప్రస్తుత జనాభా 130 కోట్ల పైమాటే. వ్యాక్సినేషన్‌ మిషన్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.50 వేల కోట్లు కేటాయించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కరోనా టీకాలను ప్రజలందరికీ అందజేసే విషయంలో ఖర్చుకు ప్రభుత్వం వెనుకాడబోదని వెల్లడించాయి. భారత్‌లో ఒక్కో టీకా డోసుకు 2 డాలర్ల చొప్పున ఖర్చు కానుందని అంచనా. ఒక్కో వ్యక్తికి రెండు డోసుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి 4 డాలర్లు ఖర్చవుతాయి. వ్యాక్సిన్‌ రవాణా, నిల్వ కోసం మరో 3 డాలర్లు అవసరం. మొత్తంమీద ఒక్కో పౌరుడిపై ప్రభుత్వం 7 డాలర్ల (రూ.515) చొప్పున వ్యయం చేయనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top