‘మేడమ్‌.. మీరు పైకి రావొద్దు’.. రెజ్లర్ల నిరసనలో బృందా కారత్‌కు చేదు అనుభవం

Brinda Karat Faced Embarrassing Moment At Wrestlers Protest - Sakshi

ఢిల్లీ: సీపీఐ(ఎం) నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌(75)కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన వద్దకు గురువారం ఆమె చేరుకున్నారు. అయితే.. 

వేదిక ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించాలన్న ఆమె ప్రయత్నానికి రెజ్లర్లు అడ్డు తగిలారు. రాజకీయ ఎజెండాగా ఈ వ్యవహారాన్ని మార్చేయడం సరికాదంటూ మైకులోనే చెబుతూ ఆమెను వేదికపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు. ఒలింపిక్స్‌ మెడలిస్ట్‌ అయిన బజరంగ్‌ పూనియా.. ఈ నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టేజ్‌పైకి బృందా కారత్‌ ఎక్కేందుకు యత్నించగా.. తమ పోరాటాన్ని రాజకీయం చేయొద్దంటూ పూనియా ఆమెకు విజ్ఞప్తి చేశారు. దయచేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు.

అదే సమయంలో మరికొందరు రెజ్లర్లు.. కారత్‌ను ఉద్దేశిస్తూ ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలు చేయడం గమనార్హం. కారత్‌తో పాటు మరికొందరు కమ్యూనిస్ట్‌ నేతలు ఆ సమయంలో వేదిక మీదకు వెళ్లకుండా నిలిచిపోయారు. ఆపై కాసేపటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, బీజేపీ కైసర్‌గంజ్‌ ఎంపీ(ఉత్తర ప్రదేశ్‌) బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి. అవినీతి, మానసికంగా వేధింపులు, లైంగిక వేధింపుల పర్వం కొనసాగుతోందంటూ హస్తిన నడిబొడ్డున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కామన్‌ వెల్త్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ వినేష్‌ ఫోగట్‌, మరో ఛాంపియన్‌ సాక్షి మాలిక్‌లు స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో.. వ్యవహారం మరింత ముదిరింది. బ్రిజ్‌ భూషణ్‌, కోచ్‌లు.. మహిళా రెజర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపించారు వాళ్లు.

ఇక ఈ ఆరోపణలను తోసిపుచ్చిన బ్రిజ్‌ భూషణ్‌.. తాను పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమంటూ ప్రకటించారు. ఆరోపణలు నిరూపిస్తే తల నరుక్కునేందుకు సిద్ధమంటూ ప్రకటించారు కూడా. జజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌లు వారం కిందట తనను కలిశారని, ఇద్దరూ ఎలాంటి సమస్యలు లేవని తనతో చెప్పారని, ఈ నిరసనల వెనుక తనను దించేసే కుట్ర జరుగుతోందని, ఓ బడా పారిశ్రామికవేత్త హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారాయన. 

మరోవైపు ఈ వ్యవహారంలో గురువారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. శాస్త్రి భవన్‌లోని కేంద్ర క్రీడా శాఖల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారులతో చర్చించడానికి రెజ్లర్లు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని భజరంగ్‌ పూనియా సైతం ధృవీకరించారు. సమావేశం తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ గోల్డ్‌ మెడలిస్ట్‌ డాక్టర్‌ కృష్ణ పూనియా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించారు. రెజ్లర్లకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top