నందిగ్రామ్‌లో మమతకు మరోసారి షాక్‌.. బీజేపీ ఊహించని దెబ్బకొట్టింది!

BJP Won 11 Seats In Bengal Cooperative Body Elections - Sakshi

బెంగాల్‌ రాజకీయాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు పార్టీల నేతల మధ్య మాటల వార్‌ ఇంకా నడుస్తూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో​ విజయం సాధించిన బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీకి చేదు అనుభవమే ఎదురైనప్పటికీ సీట్ల విషయం మాత్రం పుంజుకుంది.

ఇదిలా ఉండగా, తాజాగా అధికార టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. పూర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాగా ఆదివారం భేకుటియా సమబే కృషి సమితికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నికల్లో 12 సీట్లకు గానూ 11 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.

ఇక, ఈ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఒక్క సీటుకే పరిమితమైంది. మరోవైపు.. గత అసెంబ్లీ ఎన్నికల​ సందర్భంగా నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓడించారు. ఇక, బీజేపీ విజయంపై సువేందు అధికారి స్పందిస్తూ.. బీజేపీని గెలిపించినందుకు  నందిగ్రామ్ నియోజకవర్గం, భేకుటియా సమబే కృషి ఉన్నయన్ సమితి సహకార సంఘం ఓటర్లందరికీ ధన్యవాదాలు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో గొప్ప విజయానికి బాటలు వేస్తాయి అని కామెంట్స్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top