
పట్నా: బీహార్ అసెంబ్లీ(Bihar Assembly Election) ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే(NDA Alliance) కూటమికి ఊహించని షాక్ తగిలింది. మధుర అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరఫున ఎల్‌జేపీ అభ్యర్థిగా నిలిచిన సీమా సింగ్(Seema Singh) నామినేషన్ రద్దైంది. దీంతో, మధుర అసెంబ్లీ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి పోటీలో లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీల మధ్య ఉండనుంది.
వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాప్రా జిల్లాలోని మధుర అసెంబ్లీ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఎల్‌జేపీ అభ్యర్థిగా సీమా సింగ్ నామినేషన్ వేశారు. మొదటి విడత నామినేషన్ వేయడానికి అక్టోబర్ 17 చివరి తేదీ కావడంతో ఆమె.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అధికారులు శనివారం పరిశీలించగా సీమా సింగ్ నామినేషన్‌లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె నామినేషన్ రద్దు చేసినట్లు డిప్యూటీ ప్రొవిన్షియల్ ఎలక్షన్ ఆఫీసర్ (డీపీఆర్వో) ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, ఈ నియోజకవర్గంలో నామినేషన్‌లో లోపం కారణంగా సీమా సింగ్‌తో పాటు మొత్తం నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు.
సినిమా నుంచి పాలిటిక్స్‌లోకి..
సీమా సింగ్ పలు భోజ్‌పురి సినిమాల్లో నటించారు. తన మార్క్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమా రంగం నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చి అందరనీ ఆశ్చర్యపర్చారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ తనకు మధుర స్థానాన్ని కేటాయించిన తర్వాత ఆమె చాలా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి రాజకీయంగా యాక్టివ్‌గా ప్రచారం చేసుకుకున్నారు. మరోవైపు.. ఆమె తన అఫిడవిట్లో తొమ్మిదో తరగతి చదివినట్లు పేర్కొన్నారు. దీంతో, ఆమెపై ప్రజల్లో మరింత ఫోకస్ పెరిగింది. ఇదిలా ఉండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సీమా సింగ్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా షేక్‌పురాలో ఆమె హోలీ నిర్వహించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా.. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీకి గడువు నవంబర్ 22తో ముగియనుంది.