మహోజ్వల భారతి: ఫడ్కే పట్టుబడిన రోజు

Azadi Ka Amrit Mahotsav Vasudev Balwant Phadke - Sakshi

వాసుదేవ బల్వంత ఫడ్కే (1845–1883) బ్రిటిష్‌ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు. మహారాష్ట్రలోని కోలీలు, భిల్లులు, ధాంగర్లు మొదలైన తెగల సహకారంతో ‘రామోషీ’ అనే విప్లవ బృందాన్ని ఆయన తయారుచేశారు. బ్రిటిష్‌ సైనికులపై హఠాత్తుగా జరిపిన గెరిల్లా దాడుల్లోని ఒకదానిలో ఏకంగా పుణె నగరంపైనే ఫడ్కే పట్టు సాధించి కొద్దిరోజులు నిలబెట్టుకోవడంతో ఆయన వెలుగులోకి వచ్చారు. ఫడ్కే మహారాష్ట్రలోని రాయఘడ్‌ జిల్లాకు చెందిన పన్వెల్‌ తాలూకా షిర్ధాన్‌ గ్రామంలో మరాఠీ చిత్పవన్‌ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్న కాలంలో కుస్తీ, గుర్రపుస్వారీ వంటివి ఉత్సాహంగా నేర్చుకున్నారు. ఆయుధాలు లేకుండా బ్రిటిషు వారిపై తిరుగుబాటు చేయడం కష్టమని నిర్ణయించుకొని ఫడ్కే 1879లో అటవీప్రాంతంలో రహస్యంగా గిరిజన యువకులతో సైన్యాన్ని నెలకొల్పారు.

ఆ సైన్యం ఆయుధాలు సమీకరించేది. ఆర్థిక  అవసరాలకోసం ధనికులైన ఆంగ్లేయులను బంధించి, దోపిడీ చేసేది. దేశవ్యాప్తంగా వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకకాలంలో అనేక దాడులను నిర్వహించడానికి వాసుదేవ బల్వంత ఫడ్కే ప్రణాళికలు రచించినా పరిమిత విజయాన్నే అందించాయి. ఒకసారి ఘనూరు గ్రామంలో బ్రిటిషు సైన్యంతో నేరుగా తలపడ్డాడు. ఆ తర్వాత అతడిని పట్టుకోవడానికి ప్రభుత్వం బహుమతి ప్రకటించింది.

అదే సమయంలో రోహిల్లా, అరబ్బులను తన సంస్థలో చేర్చుకోవడానికి ఫడ్కే హైదరాబాద్‌ రాష్ట్రానికి వెళ్లాడు బ్రిటిష్‌ మేజర్‌ హెన్రీ విలియం డేనియల్, హైదరాబాద్‌ నిజాం పోలీసు కమిషనర్‌ అబ్దుల్‌ హక్‌.. తదితరులు పగలు, రాత్రి ఫడ్కే అచూకి కోసం వెతికారు. 1879  జూలై 20న అతడు పండార్‌పూర్‌ వెళ్తున్నప్పుడు కొందరు నమ్మక ద్రోహులు ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్‌ సైనికులు అతడిని పట్టి బంధించారు. తర్వాత జీవిత ఖైదు విధించారు. 1883 ఫిబ్రవరి 13న ఫడ్కే జైలు నుండి తప్పించుకున్నా మళ్లీ వెంటనే బ్రిటిష్‌ పోలీసులకు దొరికిపోయాడు. అప్పటినుంచి నిరాహార దీక్ష చేస్తూ ఫిబ్రవరి 17న ఫడ్కే తుదిశ్వాస విడిచాడు.  

(చదవండి: మొబైల్‌ ఫోన్‌ల శకారంభం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు 

Read also in:
Back to Top