
‘సిస్టర్ నిర్మల‘గా ప్రసిద్ధి చెందిన నిర్మలా జోషి క్యాథలిక్ నన్. మదర్ థెరిస్సా శిష్యురాలు. థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సుపీరియర్ జనరల్‌గా సిస్టర్ నిర్మల బాధ్యతలు నిర్వర్తించారు. సంస్ధ సేవా కార్యకలాపాలను మరింతగా 134 దేశాల వరకు విస్తరింపజేశారు. నిర్మల 1934 జూలై 23 న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పది మంది సహోదరులలో నిర్మల పెద్దమ్మాయి. ఆమె తండ్రి 1947 లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకు బ్రిటిష్ ఇండియా ఆర్మీలో అధికారిగా నేపాల్‌లో ఉండేవారు.
ఆమెకు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు నిర్మలను భారతదేశానికి తీసుకొని వచ్చారు. నిర్మల మౌంట్ కార్మెల్ లోని క్రిస్టియన్ మిషనరీస్ లో విద్యాభ్యాసం చేశారు. ఆ కాలంలో ఆమె మదర్ థెరిసా సేవాభావాన్ని అలవరచుకొని ఆమెకు సహాయంగా ఉండాలని భావించారు. వెంటనే 17 ఏళ్ల వయస్సులో నన్‌గా మారారు. నిర్మల రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ‘లా’ లో డాక్టరేట్ చేశారు. 1976లో మదర్ థెరిసా వారసురాలిగా ఆమోదం పొందారు. సిస్టర్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2009 లో ఆమెను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. హృద్రోగం కారణంగా నిర్మల 2015 జూన్ 23న కోల్‌కతాలో మరణించారు.
గ్రీన్ గాంధీ
చండీ ప్రసాద్ భట్ గాంధేయవాది. పర్యావరణ పరిరక్షకులు. నేడు (జూన్ 23) ఆయన జన్మదినం. భట్ స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ. 1964లో ‘దశోలి గ్రామ్ స్వరాజ్య సంఘ్’ను స్థాపించారు. ఆ సంస్థ నేతృత్వంలోనే చిప్కో ఉద్యమం కూడా సాగింది. చిప్కో ఉద్యమ నాయకులలో ఒకరైన భట్‌కు 1982లో రామన్ మెగసెసె అవార్డు, 2005లో పద్మ భూషణ్ లభించాయి. 2013లో గాంధీ పీస్ ప్రైజ్ వరించింది. 1936లో జన్మించిన చండీ ప్రసాద్ భట్ ప్రస్తుతం తన 86 ఏళ్ల వయసులో.. పర్యావరణం, సమాజం పరస్పరం ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడి ఉంటాయో చెబుతూ సోషల్ థియరిస్టుగా తన ప్రసంగాలతో యువతను మేల్కొలుపుతున్నారు.
నార్మన్ ప్రీత్‌చంద్
ప్రీత్‌చంద్ బ్రిటిష్ ఇండియన్. 1875 జూన్ 23న కలకత్తాలో జన్మించారు. క్రీడాకారుడు. రంగస్థల, సినీ నటుడు. నార్మర్ ట్రెవర్ అనే పేరుతో నటుడిగా ప్రసిద్ధులయ్యారు. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో ఆయన రెండు రజిత పతకాలు సాధించి, తొలిసారి ఒలింపిక్స్‌తో పతకం సాధించిన ఆసియావాసిగా గుర్తింపు పొందారు. తన 54వ యేట యు.ఎస్.లో మరణించారు.