అజ్ఞాత ఆజ్ఞలు | Sakshi
Sakshi News home page

అజ్ఞాత ఆజ్ఞలు

Published Thu, Jul 28 2022 8:45 AM

Azadi Ka Amrit Mahotsav Quit India Movement 1942 History - Sakshi

క్విట్‌ ఇండియా ఉద్యమకారుల తిరుగుబాట్లు, పోలీసుల దౌర్జన్యాల వార్తలతో పాటుగా 1942 అక్టోబర్‌ 29న లోహియా అజ్ఞాత రేడియో పది ఆజ్ఞలను (విధులను) నిర్దేశించింది. ఈ పది విధులను ప్రతి భారతీయుడూ ఎటువంటి సమస్య లేకుండా నిర్వహించాలని ఉద్బోధించింది. 

బ్రిటిష్‌ వారితో గానీ, వారి ప్రభుత్వంతో గానీ ఎటువంటి వ్యవహారం పెట్టుకోవద్దు. వారికి మీరిచ్చే ధనంగానీ, లేదా మీకు వారిచ్చే ధనంగానీ మన సోదర భారతీయుల రక్తంతో తడిసింది. 

ప్రతి ఇంటి మీదా, కిటికీ మీద మువ్వన్నెల జెండా ఎగురవేయండి. 
సినిమాలు చూడవద్దు. ఇతరులను చూడనీయవద్దు.
ఎందుకంటే దానికి మీరు వెచ్చించే వ్యయం దుష్ట ప్రభుత్వానికి వెడుతుంది.
కోర్టులకెళ్లడం పాపంగా పరిగణించాలి.
విదేశీ వస్తువులు కొనవద్దు.ప్రభుత్వ బ్యాంకుల నుండి మీ ధనం తీసేయండి.న్యాయం లేని ప్రభుత్వానికి సేవలందించే అధికారులను బాయ్‌కాట్‌ చెయ్యండి. 
కోర్టుకు వెళ్లే అవసరమున్న ఏ వ్యవహారమైనా కొనసాగించవద్దు.నగరాలు వదలండి, పల్లెలకు తరలండి.
రైతు పండించే ధాన్యం మొదలైనవి అతని దగ్గరే వుండనివ్వండి.. ఇవీ ఆ ఆజ్ఞలు. 

అవి క్విట్‌ ఇండియా ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులని గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు, అవి రెండో ప్రపంచ యుద్ధం రోజులు కూడా. బ్రిటిషు ప్రభుత్వం నడిపే ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్లు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, లక్నో, మద్రాసు, తిరుచిరాపల్లిలలో మాత్రమే వున్నాయి. ఇవేకాక తిరువాంకూరు, మైసూరు, హైదరాబాదు, ఔరంగాబాదు సంస్థానాలు నడిపే రేడియో కేంద్రాలున్నాయి. అయితే ఇవేవీ ప్రజల స్పందనను గానీ, స్వాతంత్య్ర ఉద్యమం వార్తలు కానీ ఇవ్వడం లేదు. వార్తాపత్రికలు సెన్సార్‌ కాకుండా అచ్చు కావడంలేదు. ఆ సమయంలో లోహియా రహస్య రేడియో కేంద్రాలు కీలకపాత్ర పోషించాయి.

అవి రోజుకు ఒకసారి ఇంగ్లీషులో, మరోసారి హిందూస్తానీలో అంటే రెండుసార్లు, ప్రతిసారి సుమారు అరగంటపాటు ప్రసారాలు అందించేవి. వార్తలు, వార్తా సమీక్షలు, గాంధీజీ, వల్లభ్‌భాయ్‌ పటేల్, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వంటి నాయకుల ప్రసంగాలు; భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం ప్రత్యేకత, డూ ఆర్‌ డై కార్యాచరణ వెనుక ఉండే తాత్విక నేపథ్యం, వర్తమాన విషయాలపై ప్రశ్నోత్తరాలు.. ఇలా చాలా ప్రయోజనకరంగా ఆ రేడియో ప్రసారాలు ఉండేవి. ఇంకా పగటిపూట శుభాకాంక్షలు, మతాల మధ్య సామరస్య ప్రబోధం కూడా ఈ ప్రసారాలలో కనబడేది. 

మచ్చుకు కొన్ని  
భారతదేశం స్వాతంత్య్రం సముపార్జించటానికి 9 కోట్ల ముస్లింలు వ్యతిరేకమనే అబద్ధ ప్రచారాన్ని గమనించమని 1942 అక్టోబరు 12 ఈద్‌ రోజున ప్రసారమైంది. విజయదశమి అంటే చెడు మీద మంచి విజయం. అబద్ధం మీద నిజం సాధించే విజయం. నిజాల్ని దాచే వార్తా పత్రికలు చదవకండి (1942 అక్టోబరు18). తెల్ల పోలీసులు భారతీయ స్త్రీలను చెరచడం అనే సమస్య ఎదుర్కోవడం నుంచి, నగరాల నుంచి ప్రజలు గ్రామాలకు తరలి వెళ్లడం వరకు ఎన్నో ప్రశ్నలకు జవాబులిచ్చారు (1942 అక్టోబరు 19) . పోస్ట్‌ ఆఫీసుల్లో ధనం పెట్టవద్దని కూడా వివరంగా ప్రకటించారు.  రైతులు, భూస్వాములు, అప్పులిచ్చే వాళ్లు ఏకమైతే చాలు తిండిలేక బ్రిటిషు సైనికులు మాడిపోతారు అంటూ డూ ఆర్‌ డై నియమానికి సంబంధించిన లోతులు (1942 అక్టోబరు 20) వివరించారు. 

ప్రత్యేక ప్రసారం 
భారతీయ స్వాతంత్య్ర ఉద్యమం చాలా ప్రత్యేకమైందని 1942 అక్టోబరు 21న చేసిన ప్రసారంలో కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా గత 200 సంవత్సరంలో జరిగిన విప్లవాలతో పోల్చి ఒక్క భారతదేశంలోనే పేదలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నట్లు విశదం చేశారు. రష్యన్‌ విప్లవంలో కేవలం ఒక శాతం జనాభా పాల్గొనగా, ఫ్రెంచి విప్లవంలో సైతం కొందరే పాలుపంచుకున్నారు.

వారందరూ ధనికులే కాని పేదలు కాదు. సాంప్రదాయకంగా విప్లవాల పంథాలో పోకుండా, ఆయుధాలు లేని పేదవారు పెద్ద సంఖ్యలో పాల్గొనడం భారతదేశంలో ఒక ప్రత్యేకత. భారతదేశంలో అనాదిగా వుండే శాంతి భావన, నిరాయుధీకరణ, గాంధీజీ అహింసా ప్రబోధం కలగలిసి భారత స్వాతంత్యోద్య్రమాన్ని ప్రపంచంలోనే సరికొత్తగా రూపొందించాయి.. అంటూ సాగిన ఈ ప్రసంగం ఎంతో విజ్ఞాన భరితమైంది. జాతికవసరమైన ఎన్నో ప్రబోధాలు రామ్‌ మనోహర్‌ లోహియా సారథ్యంలో ఆనాటి సీక్రెట్‌ రేడియో దేశానికందించింది.  
 – డా నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి పూర్వ సంచాలకులు 

(చదవండి: క్విట్‌ ఇండియా సీక్రెట్‌ సెగ ఏడు గుర్రాల రేడియో)

Advertisement
Advertisement