Azadi Ka Amrit Mahotsav: Batwada Warrior Ranga Rao Patwari Life Story - Sakshi
Sakshi News home page

జైహింద్‌ స్పెషల్‌: బట్వాటా యోధుడు రంగారావు పట్వారీ

Published Fri, Aug 12 2022 12:45 PM

Azadi Ka Amrit Mahotsav: Batwada Warrior Ranga Rao Patwari - Sakshi

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో సంస్థానాధీశులు, రాజులు, వారి సైనికులు మాత్రమే కాదు.. అజ్ఞాతంగా చిన్న చిన్న జమిందార్లు, గ్రామాధికార్లయిన పట్వారీల వంటివారు కూడా కీలక పాత్ర పోషించారు. అటువంటి విస్మృత యోధులలో నిజామాబాద్‌ జిల్లాలోని కౌలాస్‌ను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటుకు పథక రచన చేసిన రంగారావు కూడా ఒకరు. తిరుగుబాట్ల రహస్య సమాచారం పొందుపరిచి ఉన్న లేఖలను నానా సాహెబ్‌కు, నిజాం పాలనలోని సమర యోధులకు చేర్చడానికి ఆయన అనేక కష్టాలు పడ్డారు. చివరికి బ్రిటిష్‌ సైనికుల చేతికి చిక్కారు.
 చదవండి: గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి చంద్రమౌళి చెక్‌ పవర్‌ 

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి దేశవ్యాప్తంగా మరాఠా పీష్వా బాలాజీ బాజీరావు (నానాసాహెబ్‌), చివరి మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షా, ఆయన కుమారుడు మిర్జా మొగల్‌ తదితరులు నాయకత్వం వహిస్తున్న సమయంలో రంగారావు నిజాం ప్రాంతంలోని నార్కెట్‌ గ్రామ పట్వారిగా ఉన్నారు. రంగారావుతో పాటు కౌలాస్‌ జమిందార్‌ రాజా దీప్‌ సింగ్‌ (రాజా సాహెబ్‌), నిజాం ఆస్థానంలోని సఫ్దర్‌ ఉద్దౌలా మరికొంతమంది కలిసి బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు వ్యూహ రచన చేస్తుండగా 1857 ఫిబ్రవరిలో రహస్య సమర యోధుడు, బ్రిటిష్‌ సైనిక ఉద్యోగి అయిన సోనాజీ పండిట్‌ నుండి పిలుపు రావడంతో రంగారావు ఆయన్ని కలిశారు.

సోనాజీ పండిట్‌ ఆయనకు ఒక లేఖ ఇచ్చి నానా సాహెబ్‌కు అందజేయమని కోరారు. ఎక్కడో ఉత్తరభారతంలో ఉన్న నానా సాహెబ్‌ ను కలవడానికి బయలుదేరిన రంగారావు నర్మద, యమున నదులను దాటి లక్నో సమీపంలోని బెర్వతోడ గ్రామం వద్ద నానాసాహెబ్‌ కు తాను తీసుకు వచ్చిన ఉత్తరాన్ని అందజేశారు! ఆ లేఖ ద్వారా నిజాం రాజ్యంలోని బ్రిటిష్‌ పాలనా పరిస్థితులను అవగాహన చేసుకున్న నానాసాహెబ్‌... సొనాజీ పండిట్‌ లేఖకు సమాధానంగా... నిజాం రాజ్యంలో ఉన్న డఫేదారులు, జమిందార్లు, రోహిల్లాలు తిరుగుబాటు జెండా ఎగురవేసి సాధ్యమైనన్ని చోట్ల బ్రిటిష్‌ వారిని తరిమి కొట్టాలని కోరుతూ ఒక లేఖ రాసి  దానిపై తన రాజ ముద్ర వేశారు. అలాగే సఫ్దర్‌ ఉద్దౌలా, రావు రంభా నింబాల్కర్, గులాబ్‌ ఖాన్, బుజురీలను ఉద్దేశించి విడివిడిగా రాసిన లేఖలను రంగారావుకు అందజేసి ఎవరి లేఖలు వారికి అందజేయాలని కోరారు.

నిజామాబాద్‌లోని కౌలాస్‌ కోట: కౌలాస్‌ జమిందార్‌ రాజా దీప్‌ సింగ్‌ (రాజా సాహెబ్‌), మరికొందరు కలిసి బ్రటిషర్‌లపై తిరుగుబాటుకు వ్యూహరచన చేశారు. రంగారావు విస్మృత యోధుడిగా మిగిలిపోయినట్లే.. వ్యక్తిగా ఆయన రూపురేఖల్ని తెలిపే చిత్రాలు కూడా చరిత్రలో మిగలకుండా పోయాయి. 

తిరిగి వచ్చేలోగా..!
రంగారావు ముందుగా ఔరంగాబాద్‌ చేరుకుని గులాం ఖాన్, బుజురీలను కలిసి వారి లేఖలను వారికి అందజేశారు. ఆ క్రమంలో కొండలు, నదీనదాలు, అడవులను అధిగమిస్తూ అలుపెరగని ప్రయాణం చేస్తున్న రంగారావును ఒకరోజు బందిపోటు దొంగలు చుట్టుముట్టారు. డబ్బు, ఆహార పదార్థాలతో పాటు ఆయన చేతిలో ఉన్న సఫ్దర్‌ ఉద్దౌలా, నింబాల్కర్‌లకు ఉద్దేశించిన  లేఖలను కూడా దోచుకున్నారు. రంగారావు  ధైర్యం వీడలేదు. సోనాజీ పండిట్‌ కి రాసిన లేఖ, మరో లేఖ తలపాగాలో దాచి ఉంచడం వల్ల వాటిని దొంగలపాలు కాకుండా రక్షించుకోగలిగారు. చివరికి అలసిసొలసి సోనాజీ పండిట్‌ ఉండే గ్రామానికి తిరిగివచ్చిన రంగారావుకు సోనాజీ మరణించాడనే వార్త తెలిసి ఖిన్నుడయ్యాడు.

ఆ ఘటనతో రంగారావు తనే స్వయంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఉద్యమ నాయకత్వాన్ని భుజానికెత్తుకుని హైదరాబాద్‌ వైపు కదిలారు. తన ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా ఎంతో మందిని కలిసి మద్దతు పొందడానికి ప్రయత్నించారు. వెళ్లే మార్గంలో మాదాపూర్‌ గ్రామ నాయక్‌కు, తర్వాత హల్లి గ్రామానికి వెళ్లి బాబూ పటేల్‌కు, ఆ తర్వాత చక్లి గ్రామం చేరి అధికారిని కలిసి సోనాజీకి నానాసాహెబ్‌ రాసిన లేఖ చూపించారు. అయితే ఎవరూ ఆయనకు సహాయం చేయలేదు. దీంతో హైదరాబాద్‌ వెళ్లకుండా నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న కౌలాస్‌ చేరారు. అక్కడే కొంతకాలం గడిపారు.

ఈ కాలంలో నాలుగుసార్లు కౌలాస్‌ రాజాతో చర్చలు జరిపారు. ఇక్కడ ఉండటం ఎవరికీ శ్రేయస్కరం కాదని, కాబట్టి మకాం మార్చమని రాజా సాహెబ్‌ చెప్పడంతో నీలేకర్‌ గ్రామం చేరి రఘునాథ్‌ పజ్జీ దగ్గర రెండువారాలు ఆశ్రయం పొందారు. అయితే రఘునాథ్‌.. తిరుగుబాటుకు సంబంధించి ఎటువంటి సహాయం అందించడానికి నిరాకరించడమే కాక సొంత ఊరికి పోయి హాయిగా శేష జీవితం గడపమని రంగారావుకు సలహా ఇచ్చాడు. పట్టువదలని విక్రమార్కుడిలా రంగారావు మాణిక్‌ నగర్‌ వైపు నడిచి మాణిక్‌ ప్రభుని కలిసి తన కథను వినిపించారు. ప్రభు వద్ద ఎనిమిది రోజులు గడిపి, అతడి ఆశీస్సులతో నీలేకర్‌ గ్రామానికి వెళ్లి బడే అలీని కలిశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలలో తిరుగుబాటు వచ్చినప్పుడు తాను తప్పకుండా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

కనిపెట్టిన బ్రిటిషర్లు!
ఈ పరిస్థితుల్లో స్వగ్రామం వైపు బయల్దేరిన రంగారావు మార్గమధ్యంలో బ్రిటిష్‌ సైన్యానికి  చిక్కాడు. 1859, ఏప్రిల్‌12 న ‘ఇంగ్లిష్‌మెన్‌’ అనే ఆంగ్లపత్రికలో ఆయన ఆరెస్టు వార్త వచ్చింది. బ్రిటిష్‌ సైన్యం రంగారావుతో పాటు కౌలాస్‌ రాజా దీప్‌ సింగ్, సఫ్దరుద్దౌలాలను, వారి అనుచరులను అరెస్టు చేసింది. రాజా దీప్‌ సింగ్‌ కు మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. జాగీరును కూడా స్వాధీనం చేసుకుంది. తర్వాత ఆ జాగీర్‌ ను ఆయన కుమారునికి ఇచ్చింది. సఫ్దరుద్దౌలాను పదవి నుంచి తొలగించి అతడి స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని జీవిత ఖైదు విధించారు. రంగారావుకు మరణశిక్ష విధించినా... తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి అండమాన్‌కు పంపారు. ఆయన 1860 సంవత్సరంలో అక్కడే చనిపోయారు.
– జి. శివరామకృష్ణయ్య    

Advertisement
Advertisement