
573 బస్సులకు నో ఫిట్‌నెస్
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకోలేదు. చాలా బస్సులు ఫిట్‌గా లేకుండానే విద్యార్థులను తరలించడానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1,336 స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో బుధవారం సాయంత్రం వరకు 763 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తిచేయగా.. మరో 573 బస్సులు ఫిట్‌నెస్ పరీక్షలు చేసుకోలేదు.
డీటీఓలకు ఆదేశాలు..
ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేసుకోవడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో జిల్లా ఆర్టీఏ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌లు ప్రారంభించినట్లు డీటీసీ కిషన్ వెల్లడించారు. మొదట జిల్లాకేంద్రాలతో పాటు పాఠశాలలు అధికంగా నిర్వహించే పట్టణాల్లో ఆర్టీఏ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫిట్‌నెస్, పర్మిట్ ఇతర పత్రాలు పరిశీలిస్తామన్నారు. అన్ని స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతోపాటు 15 ఏళ్లు దాటిన వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేపడుతామన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయడానికి అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల డీటీఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీటీసీ పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో పునఃప్రారంభమైనపాఠశాలలు
స్కూల్ బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
ఫిట్‌నెస్ లేకుండా నడిపితే కేసులు నమోదు

573 బస్సులకు నో ఫిట్‌నెస్