రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం

Jun 21 2026 6:46 AM | Updated on Jun 21 2026 6:46 AM

వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ నాయకులు

నంద్యాల(వ్యవసాయం): రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ పెద్ది శ్రీనివాసులు, స్టేట్‌ అఫీషియల్‌ స్పోక్స్‌ పర్సన్‌ తిమ్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ ప్రతినిధుల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో పోలీసుల పాత్ర ప్రధానమైనదని, అయితే కూటమి ప్రభుత్వంలో వారు రాజకీయ తొత్తులుగా మారారన్నారు. ఇటీవల కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో సాయికృష్ణ అనే యువకుడి లాకప్‌డెత్‌ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి సాయికృష్ణ లాకప్‌డెత్‌ వివరాలను తెలుసుకున్నారన్నారు. అంతవరకు కనీసం స్పందించని ప్రభుత్వం నేడు కృష్ణలంక సీఐపై కేసు నమోదు చేయించిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, వాటిని పక్కకు తప్పించి వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు.

జూనియర్‌ న్యాయవాదులకు మోసం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జూనియర్‌ న్యాయవాదులకు రూ.5వేలు ఇచ్చేవారని వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ నాయకులు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో జూనియర్‌ న్యాయవాదులకు రూ.10వేలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. 2025 డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదని, కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడం పని పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ నాయకులు కృష్ణారెడ్డి, వివేకానందరెడ్డి, సుబ్బయ్య, జగన్‌మోహన్‌రెడ్డి, రామాంజనేయులు, వసంత్‌రెడ్డి, శరత్‌, సాయిరాంరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement