ఫ దాతలు సిద్ధంగా ఉన్నా పట్టించుకోని అధికారులు
ఫ అరిష్టమంటున్న అర్చకులు
మిర్యాలగూడ : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ధ్వజ స్తంభం రెండేండ్ల క్రితం విరిగి పక్కకు ఒరిగిపోయి ఉంది. ఈ ధ్వజ స్తంభాన్ని పునర్నిర్మించేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ, దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, మూసీ నదుల సంగమం పవిత్ర పుణ్యక్షేత్రంగా మీనాక్షి అగస్త్యేశ్వరస్వామి దేవాలయం, లక్ష్మీనరసింహాస్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో రెండేండ్ల క్రితం ధ్వజస్తంభం విరిగిపోయి రేకులపై ఒరిగి ఉంది. ఆ రోజుల్లోనే ప్రముఖ అర్చకులు, సిద్ధాంతులు వెంటనే ధ్వజ స్తంభం నిర్మాణం చేసి దోష నివారణ పూజలు, హోమాలు నిర్వహించి స్వామివారి కల్యాణం నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలువురు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. అయినా దేవాదాయ శాఖ అధికారులు రెండేళ్లుగా ధ్వజ స్తంభం పునర్నిర్మాణం చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇది అరిష్టదాయకమని బ్రాహ్మణులు, పులువురు హిందూ సంఘాల నాయకులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి ధ్వజ స్తంభం పునర్నిర్మాణం చేపట్టి ఆలయాన్ని ప్రక్షాళన చేసి, పూజలు, హోమాలు, స్వామివారి కల్యాణం నిర్వహిస్తే అందరికీ మంచి జరుగుతుందని భక్తులు అంటున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ జ్యోతిని వివరణ కోరగా త్వరలో నూతన ధ్వజ స్తంభం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


