యాదగిరి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం విశేషంగా జరిపించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ ఆండాళ్ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆండాళ్ అమ్మవారిని అలకరించిన తరువాత ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. ఈ సమయంలో మహిళ భక్తులు మంగళ హారతులతో స్వాగతం ఫలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవోత్సవం చేపట్టారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ఆలయంలో సుప్రభాతం, సహస్రనామార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సం, ఇతర పూజలు నిర్వహించారు.
శివాలయంలో కార్తీక దీపారాధనలు
యాదగిరిగుట్ట: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం యాదగిరి కొండపై శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో భక్తులు కార్తీక దీపారాధనలు నిర్వహించారు. మహాశివుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఉప ఆలయం ఎదుట భక్తులు శ్రీ ఆకారంలో దీపాలు వెలిగించారు.


