భువనగిరి గుండా వెళ్లే పలు రైళ్లు రద్దు
భువనగిరి: మోంథా తుపాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో బుధవారం భువనగిరి రైల్వే స్టేషన్ గుండా వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా విజయవాడ, కాకినాడ, విశాఖపట్నంకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. సమచారం తెలుసుకుని ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
ప్రయాణికుల ఇబ్బందులు..
బీబీనగర్ : రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీబీనగర్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు రైళ్లు రద్దయిన విషయం తెలుసుకుని వరంగల్–హైదరాబాద్ హైవేకు చేరుకొని బస్సులను ఆశ్రయించారు. తుపాన్ కారణంగా సికింద్రాబాద్–బీబీనగర్ రైల్వే మార్గం గుండా వెళ్లే భాగ్యనగర్, నారాయణాద్రి, విశాఖ, కాకతీయ నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు.
రైళ్ల రాకపోకలు ఇలా..
సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే రైలును అప్ అండ్ డౌన్‌లో రద్దు చేశారు. భాగ్యనగర్ రైలును, సికింద్రాబాద్ నుంచి కాకినాడ పోర్టు వరకు వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. కాకినాడ నుంచి వచ్చే రైలు యథావిధిగా నడుస్తోంది. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌కు వచ్చే అప్ అండ్ డౌన్ రైలును కాజీపేట మీదుగా కాకుండా దారి మళ్లించి గుంటూరు–నడికుడి మీదుగా.. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును ఖాజీపేట మీదుగా కాకుండా బీబీనగర్–నడికుడి మీదుగా నడిపిస్తున్నారు. కాకతీయ, పుష్‌పుల్ రైళ్లను యథావిఽధిగా నడిపిస్తున్నారు.


