రైళ్ల రాకపోకలకు అంతరాయం
మిర్యాలగూడ అర్బన్ : మోంథా తుపాన్ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సికింద్రాబాద్ నుంచి నల్లగొండ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్టాలను కలుపుతూ వెళ్లే జన్మభూమి, విశాఖ, ఫలక్‌నుమా రైళ్లు బుధవారం కొంత ఆలస్యంగా నడిచాయి. కాగా బుధవారం సాయంత్రం గుంటూరు వెళ్లాల్సిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ రద్దు చేసింది. గురువారం ఉదయం రావాల్సిన పల్నాడు ఎక్స్‌ప్రెస్ కూడా రద్దయినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
సమయానికి వ్యాక్సిన్లు వేయాలి
పెద్దవూర : చిన్నపిల్లలకు వ్యాక్సిన్లను సమయానుసారంగా వేయాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయవద్దని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎస్.పద్మ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను, రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. బాలింతలు, చిన్న పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేలా ఆశ వర్కర్లకు దిశానిర్దేశం చేయాలన్నారు. ఆమె వెంట మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్, రాము, ఉదయ్, సీహెచ్‌ఓ శ్రీనివాస్, ఏఎన్‌ఎం వెంకటమ్మ ఉన్నారు.
డ్రగ్స్ నియంత్రణలో విఫలం
నల్లగొండ టౌన్ : డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు, నిఘా సంస్థలు విఫలమయ్యాయని ఐద్వా కేంద్ర నాయకురాలు పుణ్యవతి అన్నారు. బుధవారం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఐద్వా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, మద్యం సమాజాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నామని, గ్రామీణ స్థాయి వర కు ఈ ఉద్యమాలను విస్తరించి మహిళలను చైతన్యవంతులను చేసి పోరాడుతామన్నారు. సమావేశంలో పాలడుగు ప్రభావతి, పోలెబోయిన వరలక్ష్మి, కొండ అనురాధ, తుమ్మల పద్మ, పాదూరి గోవర్ధన, ఎండీ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
కట్టంగూర్ : వైద్యాధికారులు, సిబ్బంది సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. కట్టంగూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, మండల వైద్యాధికారిణి శ్వేత, వైద్య సిబ్బంది ఉన్నారు.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
రైళ్ల రాకపోకలకు అంతరాయం


