ఆశ్రమ పాఠశాల జల దిగ్బంధం
దేవరకొండ : దేవరకొండ మండలం కొమ్మేపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల చుట్టూ వరద నీరు చేరడంతో జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పాఠశాలలో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం రోప్ సహాయంతో 500 మంది విద్యార్థులను, 26 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని బయటికి తీసుకొచ్చింది. అక్కడి నుంచి విద్యార్థులను ప్రైవేల్ స్కూల్ బస్సుల్లో మండల పరిధిలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలకు తరలించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
నల్లగొండ : కొమ్మేపల్లి ఆశ్రమ పాఠశాలలోకి వర్షపు నీరు చేరిన ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఆరా తీశారు. పాఠశాలకు ప్రహరిగోడ లేకపోవడం, లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల స్కూల్‌లోకి నీరు చేరిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రికి వివరించారు. రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో విద్యార్థులను పక్కనే ఉన్న బీసీ గురుకులంలోకి తరలించామని చెప్పారు. స్కూల్లో వర్షపు నీరు చేరిందని తెలియగానే అడిషనల్ ఎస్పీ, పోలీసు సిబ్బందితో కలిసి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మంత్రి దృష్టికి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. వెంటే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మంత్రి అభినందించారు.
అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటిరెడ్డి
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహంపై ఆరా తీసి.. అత్యవసరం అయితే అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.


