చట్టాలకు విలువ ఇవ్వనివారు దేశద్రోహులు
నల్లగొండ టౌన్ : దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించని, చట్టాలకు విలువ ఇవ్వని వారు దేశద్రోహులు అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. నల్లగొండలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితులపై ఇప్పటికీ వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయ్‌పై దాడి జరగడం బాధాకరమన్నారు. ఈ ఘటన జరిగి మూడు వారాలు గడుస్తున్నా ఢిల్లీ పోలీసులు మౌనంగా ఉన్నారని, కేసులు పెట్టలేదని, న్యాయవ్యవస్థ సుమోటోగా కేసు తీసుకోలేదని ఆయన విమర్శించారు. మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించ లేదంటే ఈ దేశంలో దళితులకు ఎంత రక్షణ ఉందో అర్థమవుతోందన్నారు. ఆ దాడిని, దళితులందరిపై జరిగిన దాడిగా భావిస్తూ నవంబర్ 1న హైదరాబాద్‌లో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్, బకరం శ్రీనివాస్, ఇరిగి శ్రీశైలం, మల్లేపాక వెంకన్న, మేడి శంకర్, కొమిరె స్వామి, కూరపాటి కమలమ్మ, పోలె యాదయ్య పాల్గొన్నారు.
రైతాంగాన్ని ఆదుకోవాలి
శాలిగౌరారం : మోంథా తుపాన్ కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అద్యక్షుడు మంద కృష్ణ కోరారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో ఓ కార్యక్రమానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలన్నారు.
ఫ మంద కృష్ణమాదిగ


