వికసిత్ భారత్ లక్ష్యంగా సర్దార్ @150
నల్లగొండ : వికసిత్ భారత్ లక్ష్యంగా సర్దార్ @150 యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు కేసరి దేవ్‌సిన్హా జ్వాల తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అధికారులు, మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమానికి తాను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా నియమితులైనట్లు తెలిపారు. జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఈనెల 31 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు విడతల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. మార్చ్‌లో 3 రోజుల పాదయాత్రను జిల్లాస్థాయిలో నిర్వహించాలని పేర్కొన్నారు. యూనిటీ మార్చ్ నిర్వహించడంలో భాగంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అధికారులతో కోర్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ప్రజలకు తెలియజేయడం, వైద్య శిబిరాల నిర్వహణ, యోగా క్యాంపులు, ఎగ్జిబిషన్లు, వర్క్‌షాప్‌లు, విద్యార్థులకు డిబేట్లు, వీధి నాటకాలు, ప్రచారాలు, స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నల్లగొండ కలెక్టరేట్‌లో ఆర్డీఓ అశోక్‌రెడ్డి యూనిటీ మార్చ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎండీ.అక్బర్‌అలీ, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, మెప్మా పీడీ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


