భద్రత కార్మికుడి బాధ్యత
భూపాలపల్లి అర్బన్: భద్రత అనేది సంస్థ అమలు చేసే నియమం మాత్రమే కాదని ప్రతీ కార్మికుడి వ్యక్తిగత బాధ్యత అని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, భద్రత కమిటీ కన్వీనర్ శ్రీనాద్ తెలిపారు. 56వ వార్షిక భద్రత పక్షోత్సవాలను సోమవారం ఏరియాలోని కేటీకే 1వ గనిలో ప్రారంభించారు. ఈ పక్షోత్సవాల ప్రారంభోత్సవానికి జీఎం, భద్రత కమిటీ కన్వీనర్ హాజరై జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తికి భద్రత అనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. సింగరేణి సంస్థలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రతీ ఉద్యోగి విధులు ముగించుకొని ఇంటికి సురక్షితంగా చేరడమే సంస్థ లక్ష్యమన్నారు. ఉద్యోగుల నిర్లక్ష్యం, చిన్న తప్పిదం వల్ల పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతీ ఒక్కరు భద్రత పరికరాలను వినియోగించుకోవాలని సూచించారు. భద్రత పక్షోత్సవాలు ఉద్యోగుల్లో అవగాహన పెంపుతో పాటు, సమగ్ర భద్రతా సంస్కృతిని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సూచించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి రక్షణ ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మణ్, రాధాకృష్ణ, తిరుపతి, అఫ్సర్‌పాషా, కిరణ్‌కుమార్, అమరనాథ్, శ్రీనివాసరావు, డాక్టర్ రాహుల్, రాజు, కిరణ్‌కుమార్, కార్మిక సంఘాల నాయకులు రమేష్, హుస్సేన్, కృష్ణప్రసాద్, రవీందర్, తిరుపతి, సదయ్య పాల్గొన్నారు.
గైర్హాజరు ఉద్యోగులకు కౌన్సిలింగ్
ఏరియాలోని కేటీకే ఓపెన్‌కాస్ట్–2ప్రాజెక్ట్‌లో గైర్హాజరు ఉద్యోగులకు సోమవారం అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. గని మేనేజర్ రమాకాంత్ కౌన్సిలింగ్ నిర్వహించి సూచనలు చేశారు.
ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్
రాజేశ్వర్‌రెడ్డి


