కర్రె గుట్టలపైకి రహదారి
● బేస్ క్యాంపు నుంచి పామునూరు వరకు
● ప్రారంభమైన 10కిలో మీటర్ల పనులు
వాజేడు: కర్రె గుట్టలను పర్యాటక హబ్, ప్రశాంత ప్రదేశంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనుల్లో ముందడుగు వేసింది. అందులో భాగంగానే ముందుస్తుగా మండల పరిధిలోని మొరుమూరు గ్రామం వద్ద సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేసిన వారం రోజుల వ్యవధిలో రహదారి పనులను చేపట్టారు. మొరుమూరు బేస్ క్యాంపు నుంచి కర్రె గుట్టలపై ఉన్న పామునూరు వరకు రహదారిని నిర్మిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం రహదారి నిర్మాణ పనులకు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. మొరుమూరు బేస్ క్యాంపు నుంచి పామునూరు వరకు 10 కిలో మీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. రహదారి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే పోలీస్ బలగాలు గుట్టలపైకి వెళ్లడానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.


