సమయం లేదు మిత్రమా!
ఒక అవకాశం ఇవ్వండి..
● సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ముగిసిన మొదటి, రెండో విడత నామినేషన్ల పర్వం
● మొదటి విడత పోలింగ్ అభ్యర్థుల ప్రచారానికి వారం రోజులే గడువు
● అన్నివర్గాల మద్దతు కూడగట్టేందుకు
అభ్యర్థుల తాపత్రయం
ములుగు: తొలి విడత నామినేషన్లు నవంబర్ 29న ముగియగా, రెండో విడత నామినేషన్లు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 11న తొలి విడత సర్పంచ్ ఎన్నికలు జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో జరగనున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానా లకు నేడు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరి లో ఉన్న అభ్యర్థులను ప్రకటించి గుర్తులను కేటా యించనున్నారు. ఎన్నికల కంటే రెండు రోజుల ముందే ప్రచారాన్ని నిలిపి వేయనుండగా తొలి విడత అభ్యర్థులు ప్రచారం నిర్వహించేందుకు వా రం రోజుల సమయం మాత్రమే ఉంది. వారం రో జుల్లో అన్ని వర్గాల మద్దతు కూడబెట్టుకోవడమే కా కుండా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించాల్సి ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
అభ్యర్థుల్లో టెన్షన్..
అదేవిధంగా రెండో విడత ఎన్నికలు ఈ నెల 14వ తేదీన ఉండగా నామినేషన్ల పర్వం ముగిసింది. 6వ తేదీన ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి గుర్తులను కేటాయించనున్నారు. మూడు విడతల్లో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ప్రచారానికి వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం మొదలైంది. సర్పంచ్, వార్డు స్థానాలకు అత్యధికంగా నామినేషన్లు పడిన చోట రెబెల్స్‌ను బుజ్జగించడం, బరిలో ఉన్న అభ్యర్థులకు ఖర్చుల కింద ప్యాకేజీలు ఇవ్వడం లాంటి సంఘటనలు కొనసాగే అవకాశం ఉంది.
నువ్వా.. నేనా..
పంచాయతీ ఎన్నికల్లో నువ్వా.. నేనా అనే విధంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. ప్రచారంలోనే కాకుండా ఖర్చులో కూడా వెనుకాడేది లేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న చోట సర్పంచ్ అభ్యర్థులు ఓటరుకు రూ.200 నుంచి 300లు, బీసీ, ఆన్ రిజర్వుడ్ ఉన్న చోట ఒక్కొక్క ఓటుకు రూ.500ల నుంచి రూ.1000లు ఇచ్చేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మద్యం, డబ్బులు ఏరులై పారే అవకాశం ఉండగా, ఎన్నికల అధికారులు ఎంతమేర అరికడతారో వేచి చూడాల్సిందే.
సర్పంచ్ అభ్యర్థిగా తమకు ఒక అవకాశం ఇవ్వాలని ఆశావహులు ప్రజలను వేడుకుంటున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు కుల సంఘాల నాయకులు, పెద్ద మనుషులను బతిమాలుకుంటున్నారు. సమయం తక్కువగా ఉండడంతో పాటు ఎన్నికల ఖర్చు సైతం తగ్గి ఈసారి విజయావకాశాలు కొంచెం మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో పార్టీలకు చెందిన పెద్ద నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవైపు సమయం లేకపోవడం, మరోవైపు చోటా, బడా నేతలను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎలాగైనా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి అంశాలు సానుకూలంగా ఉంటాయనే అంశంపై ఆయా పార్టీల పెద్దలు గ్రామాల్లో ఉన్న ముఖ్య నేతల నుంచి సలహాలు కోరుతున్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎలాగైన గెలిపించాలని, పార్టీల్లో విభేధాలు ఉంటే సమన్వయం చేసుకోవాలని గ్రామపంచాయతీ పరిధిలోని నాయకులకు, కార్యకర్తలను ఆయా పార్టీలకు చెందిన జిల్లా అధ్యక్షులు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.
సమయం లేదు మిత్రమా!


