బస్టాండ్ నిర్మాణ పనుల పరిశీలన
మంగపేట: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండ్ భవన నిర్మాణం పనులను ఆర్టీసీ కరీంనరగర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సల్మాన్, వరంగల్ ఈఈ రవీంద్రనాథ్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. రూ.52 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన పనులు ఏడాదిన్నర అవుతున్నా నేటికి నత్తనడకన కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానుండడంతో బస్టాండ్ నిర్మాణ పనులు ఎంతమేరకు జరిగాయి, ప్రభుత్వ నిబంధనల మేరకు కాంట్రాక్టర్ పనులు చేస్తున్నాడా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పని గడువు ముగిసినా పనులు పూర్తి కాకపోవడం నిబంధనల మేరకు గ్రౌండ్‌లో గ్రావెల్‌కు బదులు పంట పొలాల్లోని ఇసుక మట్టిని నింపిన విషయంపై సంబంధిత కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ భవన నిర్మాణం, ప్రాంగణం గ్రౌండ్‌లో గ్రావెల్‌తో ఫిల్లింగ్ చేసి పైన మెటల్ లేర్ వేసి రోలర్‌తో రోలింగ్ చేయాల్సి ఉందని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. స్థానికంగా గ్రావెల్, కంకర దొరకడం లేదని, రోలర్ లేదని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఎస్టిమేట్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే పనులు నిలిపివేయాలని ఆదేశించారు.


