భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ములుగు రూరల్: మేడారం మహాజాతర సమయంలో ఆదిదేవత గట్టమ్మ తల్లికి భక్తులు మొక్కులు చెల్లించే క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం గట్టమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులతో కలిసి పార్కింగ్ స్థలాలను పరిశీలించి మాట్లాడారు. గట్టమ్మ ఆలయం వద్ద చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి శంకర్, సీఐ సురేష్‌కుమార్, ఎస్సై వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రాంనాథ్ కేకన్‌ను గట్టమ్మ ఆలయ ప్రధాన పూజారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతర సమయంలో ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు సురేందర్, పూజారులు కొత్త సదయ్య, మొగిలి, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి
మేడారం మహాజాతర సందర్భంగా వాహనాల రద్దీకి అనుకూలంగా ఆర్టీసీ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బస్సులు బ్రేక్‌డౌన్ అయితే వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయా లన్నారు. మహాజాతరకు భక్తులను తీసుకొచ్చే బాధ్యత ఆర్టీసీపై ఉందన్నారు. ట్రాఫిక్ నియంత్రణ బాధ్యత పోలీసులపై ఉంటుందని వివరించారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


