
‘‘తెలుగు సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. కానీ నా జీవితంలో ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదు. నేను దర్శకుడిని అవుదామనుకుంటే నటుణ్ణి అయ్యాను. చిరంజీవి, నాగార్జునగార్లకు నేను పెద్ద అభిమానిని. వాళ్ల సినిమాలను ఎన్నోసార్లు థియేటర్స్‌లో చూశాను. నా అభిమాన హీరోలు ఉన్న టాలీవుడ్‌లో నేను డైరెక్ట్‌గా ‘ఘాటీ’ వంటి తెలుగు సినిమా చేయడం ఎగ్జైటింగ్‌గా అనిపిస్తోంది’’ అని అన్నారు నటుడు విక్రమ్ ప్రభు.
అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా ‘ఘాటీ’. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు ఓ లీడ్ రోల్ చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో విక్రమ్ ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో దేశీరాజు అనే పాత్రలో నటించాను. ఈ చిత్రంలో నేను మాట్లాడే భాష నాకు సవాల్‌గా అనిపించింది. అనుష్కగారికి నేను పెద్ద అభిమానిని. ఆమె తన కళ్లతోనే అన్ని హావభావాలు పలికించగలరు. నిజానికి అనుష్కగారి ‘రుద్రమదేవి’ సినిమాలోని గోన గన్నారెడ్డి పాత్రను నేనే చేయాల్సింది. కానీ కుదర్లేదు. క్రిష్‌గారు నా గత సినిమాల్లోని చాలా సన్నివేశాల గురించి చెబుతూ, నన్ను దృష్టిలో పెట్టుకునే దేశీరాజు క్యారెక్టర్‌ను రాసుకున్నానని చెప్పిన మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌ని ఎంజాయ్ చేశాను. మా నాన్నతో (తమిళ నటుడు ప్రభు) స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది. కానీ, ఇరికించినట్టుగా ఉండకూడదు. మంచి కథ కుదిరితే చేస్తాం’’ అని అన్నారు.