Oscar Awards 2023: Interesting Facts About Oscar Academy Award Statue In Telugu - Sakshi
Sakshi News home page

Oscar Award Statue Facts: ఆస్కార్‌ ప్రతిమ నగ్నంగా ఎందుకు ఉంది? దీనికి వాడే బంగారం ఎంతో తెలుసా?

Published Wed, Jan 25 2023 2:50 PM | Last Updated on Wed, Jan 25 2023 4:45 PM

Oscar Awards 2023: Interesting Facts About Oscar Academy Award Statue - Sakshi

ఆస్కార్‌ అవార్డు.. ప్రస్తుతం ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవార్డు ఇది. సినీ రంగంలోని ప్రతిభవంతులకు ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక ఆవార్డు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఏడాదికి గానూ 95వ ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ 2023లో ఇచ్చే ఆస్కార్‌ అవార్డుల బరిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని నాటు నాటు పాటకు చోటు దక్కిన సంగతి తెలిసిందే.  దాదాపు 22 ఏళ్ల తర్వాత  భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కడం విశేషం.

అలాంటి అకాడమి అవార్డుకు ఒక్క అడుగు దూరంలో మన తెలుగు సినిమా ఉండటం నిజంగా గర్వకారణం. దీంతో అంతర్జాతీయ స్టేజ్‌పై మన తెలుగు సినిమా పేరు, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణిల పేర్లు మారుమోగుతున్నాయి. మరి అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ అవార్డు ప్రత్యేకత గురించి మీకు తెలుసా? ఇంతకీ ఆస్కార్‌ అంటే ఏంటి? ఈ అవార్డు ఎలా తయారు చేస్తారు? ఎవరెవరికి.. ఏయే రంగాల వారికి ప్రదానం చేస్తారో ఇక్కడ చూద్దాం!

అకాడమీ అవార్డు కాస్తా ఆస్కార్‌గా ఎలా మారిందంటే?
మొదట ఈ అవార్డును అకాడమి అవార్డు అని పిలిచేవారు. దీని పూర్తి పేరు ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’. ఆ తర్వాత దీనికి ఆస్కార్‌ అనే పేరు పెట్టారు. ఆ పేరు ఎలా వచ్చిందనేది కచ్చితమైన సమాచారం లేదు. కానీ దీని వెనుక ఓ ఊహాగానం ఉందట. అదేంటంటే ఈ అకాడమీ అవార్డులను ఇచ్చే సంస్థకు మార్గరెట్ హెరిక్ అనే మహిళ సేవలందించారట. విజేతలకు అందించే ఈ అవార్డు ప్రతిమను చూసి ఆమె.. ‘దీని ఆకృతి మా అంకుల్ ఆస్కార్‌లా ఉంది’ అని చెప్పిందట. దీంతో అలా 'ఆస్కార్ అవార్డు' పేరు వచ్చింది. 1939లో ఇదే పేరును అధికారికంగా కూడా స్వీకరించారు.

ఈ అవార్డు ప్రతిమను ఎలా తయరు చేస్తారంటే!
ఆస్కార్ అవార్డును చూడటానికి బంగారంలా మెరిసిపోతుంది. దీంతో అంతా ఈ అవార్డును బంగారంతో చేస్తారని భావిస్తారు. నిజానికి ఆస్కార్‌ ప్రతిమలో ఉండేదంతా బంగారం కాదు. దీనిని కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు. ఇక ఈ ప్రతిమను పదమూడున్నర అంగుళాల ఎత్తు అంటే 35 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉంటుంది. బరువు మాత్రం దాదాపు నాలుగు కేజీలు (ఎనిమిదిన్నర పౌండ్ల బరువుతో) తయారు చేశారు. దీనికి ఐదు స్పోక్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను(నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలు) ఇవి సూచిస్తాయి. 

అయితే ఈ అవార్డు సృష్టికర్త ఎంజీఎం స్టూడియో ఆర్డ్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్. ఆయన ఆస్కార్‌ ప్రతిమను తయారు చేసే సమయంలో డిజైన్‌ కోసం నటుడు ఎమిలో ఫెర్నాండెజ్‌ను నగ్నంగా నిలబెట్టి ఈ అవార్డు సృష్టించారు. అలా ఆ నటుడు రూపంలో కెడ్రిక్‌ గిబ్బన్స్‌  ఆస్కార్‌ ప్రతిమను డిజైన్‌ చేశారు. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా ఉంటుంది. ఇక అవార్డు తయారికి చాలా సమయం పడుతుందట. 50 ఆస్కార్ ప్రతిమలు తయారుచేయాలంటే సాధారణంగా మూడు నెలలు పడుతుంది. మొట్ట మొదటి ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం 1929లో మే 16న హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్‌లో జరిగింది.  చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. 

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నాటు నాటు సాంగ్‌కు చోటు
ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది. రీసెంట్‌గా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి.  షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి.  మొత్తానికి నామినేషన్స్‌లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి.

చదవండి: 
బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్‌లో ‘మెంటల్‌ బాలకృష్ణ’ హ్యాష్‌ ట్యాగ్‌!

ఇటివల కొత్త ఇంట్లోకి ప్రవేశం.. తాజాగా లగ్జరీ కారు కొన్న నటి శ్రీవాణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement