Akkineni, SV Ranga Rao Fans Fires on Nandamuri Balakrishna - Sakshi
Sakshi News home page

Nandamuri Balakrishna: బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్‌లో ‘మెంటల్‌ బాలకృష్ణ’ హ్యాష్‌ ట్యాగ్‌!

Published Wed, Jan 25 2023 12:49 PM

Akkineni, SV Ranga Rao Fans Associations Fires on Nandamuri Balakrishna - Sakshi

సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో నిలిచారు. ఆయన లేటెస్ట్‌ మూవీ వీర సింహారెడ్డి మూవీ సక్సెస్‌ మీట్‌ సినీ దిగ్గజాలను కించపరుస్తూ చేసిన ఆయన కామెంట్స్‌ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. సినీ దిగ్గజం, నట సామ్రాట్‌ దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేసిని సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఆయనపై మండిపడుతున్నారు.

ఇటవల జరిగిన వీర సింహారెడ్డి మూవీ సక్సెస్‌ మీట్‌లో బాలయ్య మాట్లాడుతూ ‘అక్కినేని.. తొక్కినేని’ అని వ్యాఖ్యానించడం సరికాదని, ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని అక్కినేని అభిమాన సంఘాలు, కాపునాడు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్న ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆయనను టార్గెట్‌ చేస్తున్నారు. ఈ మేరకు మెంటల్‌ బాలయ్య అని పేర్కొంటూ హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్‌. 

మెంటల్‌ హ్యాష్‌ట్యాగ్‌
‘‘అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా వివిధ ప్రాంతాల నుంచి అక్కినేని అభిమానులు స్పందించారు. దీంతో ‘మెంటల్‌ బాలకృష్ణ, ముద్దుల మామయ్య కాదు.. మెంటల్‌ మామయ్య’ అనే హ్యాష్‌ట్యాగ్స్‌ ట్విటర్‌ వేదికగా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అలాగే వివిధ సందర్భాల్లో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర ప్రవర్తనలకు సంబంధించిన వీడియోలను అక్కినేని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ‘ఈ మెంటల్‌కి సర్టిఫికెట్‌ రెన్యూవల్‌ చేయలేదా?..

మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు.. ఎస్వీ రంగారావుగారు, అక్కినేని నాగేశ్వర రావుగారి గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా అసలు?’ అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘బహిరంగ సభల్లో మాట్లాడకుండా బాలకృష్ణపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వివిధ కారణాల వల్ల ఆయన నాలుకకు అడ్డూ అదుపు ఉండటం లేదు’ అంటూ ఓ ఫ్యాన్‌ ట్వీట్‌ చేశారు. ఇటు ఎస్వీ రంగారావు అభిమానులు కూడా బాలకృష్ణ వైఖరిని తప్పుపడుతూ సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.

చివరి రోజుల్లో ఎన్టీఆర్‌కు పట్టెడన్నం కూడా పెట్టని నందమూరి వారసులు
రామారావుగారి చివరి రోజుల్లో ఆయనకు పట్టెడన్నం కూడా నందమూరి వారసులు పెట్టలేదన్న విషయం నందమూరి బాలకృష్ణగారు గ్రహించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా స్వర్గీయ వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్న సమయంలో బాలకృష్ణగారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఏ విధంగా ఆ కేసు నుంచి బాలకృష్ణగారు బయటపడ్డారనే నిజం ఆయనకే  (బాలకృష్ణ) తెలియాలి. ఈ కేసు విషయాలను బాలకృష్ణగారు బయటపెడితే మేం కూడా స్వాగతిస్తాం. ఇకనైనా బాలకృష్ణగారు సీనియర్‌ నటులను గౌరవించడాన్ని నేర్చుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇకపై ఏ నటుడైనా విమర్శలు చేస్తే అభిమానులు కూడా ప్రతి విమర్శలు చేస్తారు’’ అంటూ కడప జిల్లా నాగార్జున యువశక్తి అధ్యక్షుడు ఓ వీడియో షేర్‌ చేశారు.

ఇంకా ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారికి ఎన్నో అవార్డులు రాకుండా చేసింది ఎవరో అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు రావడానికి ముఖ్య కారకులు నాగేశ్వరరావుగారు. అలాంటి నటుడిపై బాలకృష్ణ విమర్శలు చేయడం దారుణం. సొంతంగా స్పందించిన డబ్బుతో అక్కినేని నాగేశ్వరరావుగారు అన్నపూర్ణ స్టూడియోను నిర్మించాలనుకుంటే ఆ స్థలాన్ని కూడా నందమూరి రామారావుగారు కబ్జా చేయాలని చూస్తే, కోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చింది. అయినప్పటికీ తన చివరి రోజుల్లో కూడా రామారావుగారు అక్కినేని నాగేశ్వరరావుగారిని బ్రదర్‌ అంటూ పిలిచారు. తన తండ్రి వయసుగల అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇకనైనా మానుకోవాలి’’ అన్నారు.

‘‘బాలకృష్ణ గారు వాళ్ల నాన్నగారి ముందు వీళ్లంతా ఎవరూ అక్కినేని, తొక్కినేని అంటూ అసభ్యకర పదజాలంతో మాట్లాడటం అహంకారపూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తోంది’’ అంటూ అక్కినేని ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌. సర్వేశ్వరరావు ఓ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు.  ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీ కళాకారులను మదరాసులోనే అంతం అవకుండా మొట్టమొదట హైదరాబాద్‌కు తీసుకువచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో సేవలు చేసేలా చేసి, తన నటనతో, సేవాభావంతో ఎంతోమందికి, ఆర్టిస్ట్‌లకు అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణగారి అహంకారపు మాటలను ఖండిస్తున్నాం.

మీ (బాలకృష్ణని ఉద్దేశించి) నాన్నకు అన్యాయం చేసి అధికారం లాక్కుంటే, మీ నాన్న మాటల్లో ఆ నీచుడిని చంపి నా దగ్గరికి రా బాలయ్య అంటూ ఆ రోజు మీ నాన్న నీకు చెప్తే ఈ రోజుకీ ఒక కొడుకుగా నెరవేర్చలేని నీ హీరోయిజం ఏ మాత్రానికి అని మేం ప్రశ్నించవచ్చు. కానీ మా అక్కినేని ఫ్యాన్స్‌కు ఆ సంస్కారం ఉంది. ఇక మీద మీ అహంకార కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. లేకుంటే అక్కినేని ఫ్యాన్స్‌ 
అసోసియేషన్‌ వారు చేసే విభిన్న కార్యక్రమాలకు మీరు చాలా బాధపడాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ హెచ్చరిస్తూ ఉంది’’ అని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

పవన్‌ స్పందించాలి
ఎప్పుడూ ఇండస్ట్రీకి ఏదో మేలు చేసే వ్యక్తిలా మాట్లాడే పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ‘అక్కినేని నాగేశ్వరరావుగారి’పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఓ అక్కినేని ఫ్యాన్‌ ట్వీట్‌ చేశారు. ఇక పవన్‌  కల్యాణ్‌ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ ఓ సందర్భంలో పేర్కొన్నారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘అన్‌ స్టాపబుల్‌’ టాక్‌ షో సెకండ్‌ సీజన్‌లోని ఓ ఎపిసోడ్‌కు పవన్‌ గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ త్వరలోనే స్ట్రీమింగ్‌ కానుంది.

ఇటీవలే క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ
దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ ఇటీవల బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో తన పొరపాటును మన్నించాల్సిందిగా కోరుతూ బాలకృష్ణ ఓ లేఖను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement